హైదరాబాద్, వెలుగు: జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజలతో మమేకమవ్వాలని డీసీసీ అధ్యక్షుల ట్రైనింగ్‌లో శిక్షణ పొందిన నాయకులకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం రెండో రోజుకు చేరుకుంది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడారు. సమన్వయం, క్రమశిక్షణ, సేవా భావంతో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత ప్రజాదరణ లభిస్తుందని నాయకులకు చెప్పారు.
పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సంఘటన సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ‘సంఘటన సృజన్’ ప్రోగ్రామ్ చైర్మన్ సచిన్ రావ్ ఆధ్వర్యంలో, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంశీ చంద్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నేతృత్వంలో సమర్థవంతంగా కొనసాగుతున్నది. పది రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై స్పందించే విధానం, బూత్ స్థాయి కమిటీల బలోపేతంపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు.
