పర్మిషన్లు లేని పార్టీలకు ఫామ్ హౌస్ లు, రిసార్ట్ లు ఇవ్వొద్దు: మహేశ్వరం డీసీపీ వార్నింగ్..

పర్మిషన్లు లేని పార్టీలకు ఫామ్ హౌస్ లు, రిసార్ట్ లు ఇవ్వొద్దు: మహేశ్వరం డీసీపీ వార్నింగ్..

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రిసార్ట్ లు, ఫామ్ హౌస్ లు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి.. సిటీ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ స్పీడ్ గా పెరుగుతుండటం ఒక కారణమైతే.. హైదరాబాద్ లో పార్టీ కల్చర్ వేగంగా పెరుగుతుండటం మరో కారణమని చెప్పాలి. హైదరాబాద్ శివార్లలో తరచూ ఎక్కడో ఒక చోట రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీల గురించి వార్తలొస్తూనే ఉన్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నప్పటికీ ఈ కల్చర్ కి ఫుల్ స్టాప్ పడట్లేదు. ఇటీవల మహేశ్వరంలో ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ( అక్టోబర్ 17 ) మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి ఫామ్ హౌస్, రిసార్ట్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. 

ఫామ్ హౌస్ నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలి, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు మహేశ్వరం డీసీపి సునీతా రెడ్డి . మహేశ్వరం వేగంగా అభివృద్ధి చెందడంతో ఫామ్ హౌస్, రిసార్ట్ లు ఏర్పాటు చేస్తున్నారని... ఫార్మ్ హౌస్, రిసార్ట్ యజమానులు, నిర్వాహకులు తప్పనిసరిగా పార్టీలకు కచ్చితంగా అనుమతులు తీసుకొని ఫంక్షన్లు ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించారు. ఫామ్ హౌస్, రిసార్ట్ లలో మొత్తం కనిపించేలా సీసి కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చెయ్యాలని అన్నారు. 

ఏదైనా పోలీస్ అనుమతులు కావాలంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని... పోలీసులు ఫార్మ్ హౌస్, రిసార్ట్ లను పరిశీలించినప్పుడు సహకరించాలని అన్నారు. కుటుంబ అవసరాల కోసం ఫామ్ హౌస్ లు అద్దెకు తీసుకునే వాళ్ళు కూడా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈవెంట్లు, పార్టీల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేపట్టకుండా, డ్రగ్, ముజ్ర లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత నిర్వహకులదేనని అన్నారు. వాహన దారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వారి, ఇతరుల ప్రాణాలకు హాని తలపెట్టొద్దన్నారు.