నాలుగంతస్తుల ఖరీదైన ఇళ్లు, కళ్లు చెదిరే సౌకర్యాలు.. తనిఖీ సందర్బంగా నోరెళ్లబెట్టిన ఏసీబీ అధికారులు

నాలుగంతస్తుల ఖరీదైన ఇళ్లు, కళ్లు చెదిరే సౌకర్యాలు.. తనిఖీ సందర్బంగా  నోరెళ్లబెట్టిన ఏసీబీ అధికారులు

రంగారెడ్డి జిల్లా: ఐదెకరాల 30 గుంటల భూమి పర్మిషన్ కోసం లక్షల రూపాయలు లంచం తీసుకుని పట్టుపడిన వారి ఇళ్లలో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధాన ముద్దాయిగా ఉన్న మహేశ్వరం ఎంపీవో శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు నాలుగంతస్తుల ఖరీదైన ఇంట్లో.. సకల సౌఖ్యాలు.. ఇంద్ర భోగాలంటే ఇవేనా అన్నట్లు కళ్లు చెదిరే రీతిలో ఆధునాతన ఫర్నీచర్, వసతులు చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్ పల్లిలో 5 ఎకరాల 30 గుంటల  వెంచర్ పర్మిషన్ కోసం ఎంపీఓ శ్రీనివాస్ రూ.2లక్షలు, ఉప సర్పంచ్ నర్సింహ యాదవ్, సర్పంచ్ భర్త కంది రమేష్, పంచాయతీ కార్యదర్శి గీతా ముగ్గరు కలిసి రూ.5.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే. మరో బృందం అధికారులు మహేశ్వరం ఎంపివో శ్రీనివాస్‌ కు బండ్లగూడ జాగీరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని హైదర్షాకోట్‌ కపిలానగర్‌లో ఉన్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం అధికారుల బృందం ఇంటికి చేరుకోని తనిఖీలు చేపట్టారు. నాలుగు అంతస్తుల విలాసవంతమైన భవనం.. అందులోని సౌకర్యాలు చూసిన ఆశ్చర్య పోయారు. ఇంట్లో స్విమ్మింగ్‌ పూల్‌తో పాటు జిమ్, మినీ థియేటర్‌ వంటి అధునాతన వసతులు అనేకం ఉండడంతో రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతేకాదు ఖరీదైన మద్యం బాటిళ్లతో పాటు వివిధ ప్రాంతాలలో ఓపెన్‌ ప్లాట్లు, పొలాలకు సంబంధించిన దస్తావేజులు లభించినట్లు తెలుస్తుంది. సోదాలు మొత్తం పూర్తయిన తర్వాతనే వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.