
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్వార్ సవాలును అవకాశంగా మార్చుకోవాలని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇందుకోసం ఆయన రెండు కీలక సూచనలు చేశారు. మొదటిది, వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయాలి.
పెట్టుబడి ప్రతిపాదనలకు సింగిల్-విండో క్లియరెన్స్ ఇవ్వాలి. దీంతో ప్రపంచ పెట్టుబడులకు భారతదేశం గమ్యస్థానంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండోది, పర్యాటక శక్తిని విదేశీ మారక ద్రవ్యానికి, ఉద్యోగ కల్పనకు ఇంజన్‌గా మార్చాలని సూచించారు. వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, పర్యాటకుల సదుపాయాలు మెరుగుపరచడం, భద్రత, పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఉండేలా పర్యాటక కారిడార్లను అభివృద్ధి చేయాలని మహీంద్రా వివరించారు.
ఎంఎస్ఎంఈలకు మద్దతు పెంచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం, పీఎల్ఐపథకాలను విస్తరించడం, పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించడం వంటి సంస్కరణలు అవసరమని మహీంద్రా స్పష్టం చేశారు.
1991 ఆర్థిక సంక్షోభం సరళీకరణకు దారితీసినట్టే , టారిఫ్వార్తోనూ మనకు మంచి ఫలితాలు దక్కవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడా, ఈయూ వంటి దేశాలు కూడా ఈ సవాళ్లను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని చెప్పారు.