
బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టుకెక్కారు. ఈ కేసు 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం (ECI) జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ మొయిత్రా అత్యున్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈసీఐ ఆదేశాలు: 2025 జూన్ 24న కేంద్ర ఎన్నికల సంఘం (ECI) బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో బూత్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఓటర్ల ధృవీకరణ చేస్తున్నారు. ఈ సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఎలక్టోరల్ రోల్ సమీక్ష కోసం జరుగుతుందని చెప్పిందిఈసీఐ.2025లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ కీలకమైన అంశంగా మారింది.
వివాదం ఏంటీ.. ఈ సవరణ ప్రక్రియను కాంగ్రెస్, RJD, CPI-ML, AIMIM వంటి విపక్ష పార్టీలు "వోట్‌బందీ" అంటూ విమర్శించాయి. నెల రోజుల వ్యవధిలో 8 కోట్ల ఓటర్లను ధృవీకరించడం అసాధ్యమని ఈ ప్రక్రియ పేదలు, మైనారిటీలు, వలస కార్మికుల ఓటు హక్కును హరించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మహువా మొయిత్రా పిటిషన్.. జూలై5,2025న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈసీఐ జారీ చేసిన SIR ఆదేశాలను రద్దు చేయాలని,బీహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో (వెస్ట్ బెంగాల్‌తో సహా) ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.
ఈసీఐ ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వం), 19 (వాక్ స్వాతంత్ర్యం), 21 (జీవన హక్కు), 325 (ఓటర్ల జాబితా తయారీ), 326 (ఎన్నికల ప్రక్రియ)లను ఉల్లంఘిస్తున్నాయని మొయిత్రా వాదించారు.ఈ సవరణ ప్రక్రియ అసంపూర్ణంగా, అసమర్థంగా ఉందని, ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే అవకాశం ఉందని ఆమె ఆరోపించారు.
►ALSO READ | ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ X అకౌంట్ నిలిపివేత.. కారణం ఏంటంటే..
ఏడీఆర్ పిటిషన్: అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) కూడా ఈసీఐ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. SIR ప్రక్రియను నిలిపివేయాలని ..ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని ADR వాదించింది.
2003 తర్వాత బీహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సమీక్ష జరగలేదు. ప్రస్తుతం బూత్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నారు.విపక్ష పార్టీలు ఈ ప్రక్రియను "వోట్‌బందీ"గా విమర్శిస్తున్నాయి. ఈసీఐ మాత్రం ఈ సవరణ ఎన్నికల పారదర్శకతను మెరుగు పర్చేందుకు అవసరమని వాదిస్తోంది.
సుప్రీంకోర్టు ఏమంటుంది.. మహువా మొయిత్రా ,ADR దాఖలు చేసిన పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పరిశీలనలో ఉన్నాయి. కోర్టు నిర్ణయం ఈసీఐ ఆదేశాలపై ,బీహార్ ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపవచ్చు.