ముంబయిలో ఉగ్రదాడులపై బెదిరింపు మెయిల్

 ముంబయిలో ఉగ్రదాడులపై బెదిరింపు మెయిల్

ముంబయిలో మరోమారు దాడులు జరగనున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఓ వ్యక్తి ముంబయిలో ఉగ్రదాడులు చేస్తామని బెదిరిస్తూ ఎన్ఐఏ మెయిల్ ఐడీకి మెయిల్ చేశాడు. తనను తాను తాలిబన్ గా చెప్పుకున్న ఆ వ్యక్తి.. సిరాజుద్దీన్ హక్కానీ ఆదేశాల మేరకు ముంబయిలో మరోసారి ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్టు బెదిరించాడు. దీంతో ముంబయి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులతో పాటు మిగతా దర్యాప్తు సంస్థలు కూడా దీనిపై విచారణ చేపట్టాయి. తాలిబన్ ఆర్గనైజేషన్‌లోనే సిరాజుద్దీన్ కీలక వ్యక్తి కావడంతో పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. అయితే ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం మాత్రం పోలీసులు ఇంకా తేల్చలేదు. ఈ బెదిరింపు మెయిల్ తో ముంబయిలోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

అత్యంత ప్రమాదకరమైన తాలిబన్ గ్రూప్‌ హెడ్‌ సిరాజుద్దీన్‌ కు చాలా పెద్ద నెట్‌వర్క్ ఉంది. తాలిబన్‌లలో నెంబర్ 2 పొజిషన్‌ కూడా అతనిదే. హక్కానీ జాడ చెప్పిన వాళ్లకు అమెరికా 10 మిలియన్ డాలర్ల నజరానా ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే ముంబయికి ఇలాంటి బెదిరింపులు రావడం మొదటిసారేం కాదు.. జనవరిలోనూ ఇలాంటి కాల్స్ వచ్చాయి. కంట్రోల్ రూమ్‌కి ఓ వ్యక్తి కాల్ చేసి సిటీలోని చాలా చోట్ల బాంబు దాడులు చేస్తామని హెచ్చరించాడు. మరో రెండు నెలల్లో బాంబ్ బ్లాస్ట్‌లు జరుగుతాయని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచే పోలీసులు భద్రతను మరింత పెంచి, అలర్ట్ గా ఉన్నారు.