వాకీటాకీలు వాడుతూ ఇండ్లల్లో చోరీలు

వాకీటాకీలు వాడుతూ ఇండ్లల్లో చోరీలు

గండిపేట, వెలుగు: సెల్​ఫోన్లు వాడితే టవర్ లోకేషన్ ఆధారంగా పోలీసులకు దొరుకుతామని.. వాకీ టాకీలను వాడుతూ ఇండ్లల్లో చోరీలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకి చెందిన ఇద్దరిని మైలార్‌‌‌‌‌‌‌‌దేవ్‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యూపీకి చెందిన వసీమ్(38), అదే ప్రాంతానికి చెందిన జుబేర్(35) బంధువులు. వీళ్లు వ్యాపారం కోసం దుబాయ్​కు వెళ్లిన టైమ్​లో యూపీలోని ఘజియాబాద్​కు చెందిన  మహ్మద్ షరీఫ్(54), ఢిల్లీకి చెందిన మహ్మద్ నసీమ్(42) పరిచయమయ్యారు. ఈ నలుగురు అక్కడ వ్యాపారాలు చేసి నష్టపోయారు. ఈజీ మనీ కోసం ఇండ్లల్లో చోరీలకు స్కెచ్ వేశారు. దుబాయ్ నుంచి యూపీకి వచ్చారు. ఉత్తరప్రదేశ్​తో పాటు మధ్యప్రదేశ్​లోని భోపాల్, ఏపీ, తెలంగాణలోనూ దొంగతనాలు చేశారు. సెల్ ఫోన్లు వాడితే సిగ్నల్స్, టవర్ లోకేషన్ ఆధారంగా పోలీసులు పట్టుకోవచ్చని భావించి చోరీలకు స్కెచ్ వేసినప్పుడు వాకీ టాకీలను వాడేవారు. ఎమర్జెన్సీ టైమ్​లోనే సెల్ ఫోన్లలో మాట్లాడుకునేవారు.

కొంతకాలంగా మైలార్ దేవ్ పల్లి పరిధి శాస్త్రీపురంలోని ఓ ఇంట్లో షరీఫ్, నసీమ్​ రెంట్​కు ఉంటున్నారు. భోపాల్​లో జరిగిన చోరీలకు సంబంధించి అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నిందితులు శాస్త్రీపురంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. వెంటనే మైలార్ దేవ్ పల్లి పోలీసులకు సమాచారం అందించారు. గురువారం రాత్రి భోపాల్‌‌‌‌‌‌‌‌ పోలీసులతో కలిసి మైలార్‌‌‌‌‌‌‌‌దేవ్‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులు శాస్త్రీపురంలోని ఇంటిపై దాడి చేసి షరీఫ్, నసీమ్‌‌‌‌‌‌‌‌ ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కంట్రీమేడ్ పిస్టల్, రూ. 4 లక్షల 75 వేల 500 క్యాష్, 5 వాచ్ లు, 5 సెల్ ఫోన్లు, 3 వాకీ టాకీలు, 2 ఫేక్ నంబర్ ప్లేట్లు,  ఇంటి తాళాలు పగులగొట్టేందుకు వాడే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఇద్దరు నిందితులు వసీమ్, జుబేర్ కొట్టేసిన వస్తువులను యూపీలోని బరేలిలో అమ్మేందుకు వెళ్లినట్లు షరీఫ్, నసీమ్ విచారణలో పోలీసులకు చెప్పారు. స్పెషల్ టీమ్ మిగతా ఇద్దరు నిందితుల కోసం బరేలి వెళ్లినట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.