మక్క రైతుల మహాధర్నా.. జగిత్యాలలో ఉద్రిక్తత

మక్క రైతుల మహాధర్నా.. జగిత్యాలలో ఉద్రిక్తత

జగిత్యాల జిల్లా కలెక్టర్ రేట్ వద్ద  ఉద్రిక్తంగా మారింది. ఓ వైపు 144 సెక్షన్ రాత్రి నుంచే హౌజ్ అరెస్టులు… అడుగడుగున పోలీసులు….గల్లీ గల్లీలో తనిఖీలు.. సర్కిల్లో చెక్ పోస్టులు… అయినా మక్క రైతుల మహాధర్నా ఆగలేదు. అనుకున్నట్లే జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు మక్క రైతులు. సర్కార్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మద్దతు ధరతో పాటు.. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. కలెక్టరేట్ కు చేరుకున్న రైతులను బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. వారిని అరెస్ట్ చేసి స్టేషన్లు, స్థానిక ఫంక్షన్ హాళ్లకు తరలిస్తున్నారు. అయితే అరెస్ట్ చేసిన వారిని స్టేషన్ కు తరలిస్తుండగా అడ్డుకున్నారు పోలీసులు. వ్యాన్  కు అడ్డం నిలబడ్డారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. రైతులను చెదరగొట్టారు పోలీసులు.

మక్కలు ప్రభుత్వమే కొనాలని, సన్నొడ్లకు రూ.2500 పాయల మద్దతు ధర ఇవ్వాలని.. జగిత్యాల జిల్లాలో మహాధర్నాకు పిలుపునిచ్చారు రైతులు. అయితే మహాధర్నాకు అనుమతి లేదని… జిల్లా కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు పోలీసులు. ఎవరూ గుంపులు గుంపులుగా బయటకు రావొద్దన్నారు. మక్క రైతుల మహాధర్నాతో రాత్రి నుంచే ముందస్తు అరెస్టులు జరిగాయి.  జగిత్యాల రూరల్ మండలంలో రైతులను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. అయినప్పటికీ బలవంతంగా రైతులను అదుపులోకి  తీసుకున్నారు పోలీసులు. అనుకున్నట్టే  కలెక్టర్ రేట్ వద్ద ధర్నా చేశారు రైతులు.