- ఫైమా డెలిగేట్స్తో చర్చ సందర్భంగా ఎన్ఎంసీ చైర్మన్ అభిజత్ సేథ్
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లకు లైసెన్స్ ఇవ్వడానికి, అలాగే పోస్ట్ -గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి ఒకేసారి ఉపయోగపడేలా రూపొందించిన నెక్స్ట్(నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) ఎగ్జామ్ ఇప్పట్లో నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. గత ఆగస్టు నుంచే ఈ ఎగ్జామ్ ను అమలు చేయాలని భావించినప్పటికీ, వివిధ కారణాల చేత వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా మరో నాలుగేండ్ల వరకు నెక్స్ట్ఎగ్జామ్ నిర్వహించే అవకాశం లేదని ఎన్ఎంసీ చైర్మన్ చెప్పారని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) వెల్లడించింది.
ఫైమా అధ్యక్షుడు డాక్టర్ సందీప్ డాగర్, చీఫ్ అడ్వైజర్ డాక్టర్ బిభు నందన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల ఢిల్లీలో ఎన్ఎంసీ చైర్మన్ అభిజత్ సేథ్ ను కలిశారు. ఫైమా దేశవ్యాప్త వైద్య విద్య సదుపాయాలపై చేసిన సర్వే గురించి చైర్మన్ తో ఈ భేటీలో చర్చించారు. నెక్ట్స్ ఎగ్జామ్ ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని ఎన్ఎంసీ చైర్మన్ చెప్పినట్టు భేటీ అనంతరం ఫైమా ప్రతినిధులు వెల్లడించారు. రాబోయే మూడు, నాలుగేండ్లు ఎన్ఎంసీ ఆధ్వర్యంలో మాక్ టెస్టులు నిర్వహించనున్నారని తెలిపారు. విద్యార్థులు, ఇనిస్టిట్యూషన్స్ నుంచి ఎగ్జామ్స్ పై ఫీడ్ బ్యాక్ సేకరించిన తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా నెక్స్ట్ ఎగ్జామ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారని పేర్కొన్నారు.
సొంతంగా ప్రాక్టీస్ కు జంకుతున్నరు..
వైద్య విద్య ప్రమాణాలపై ఫైమా విడుదల చేసిన ‘‘రివ్యూ మెడికల్ సిస్టమ్ సర్వే 2025”లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీల నుంచి 2 వేల మందికి పైగా వైద్య నిపుణుల అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్టును రూపొందించారు.
రిపోర్టు ప్రకారం 50.5 శాతం మంది పీజీ రెసిడెంట్లు రెసిడెన్సీ పూర్తయిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేయడానికి, సర్జరీలు నిర్వహించడానికి సిద్ధంగా లేరని వెల్లడైంది. 70.5 శాతం మంది పీజీ రెసిడెంట్లకు నిర్దిష్ట పని గంటలు లేవని, 62.1శాతం మందికి స్టైఫండ్ సకాలంలో అందడం లేదని తేలింది. అలాగే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ మెంటల్ హెల్త్ సిఫార్సులు చాలా వరకు అమలు కావడం లేదని, మారుమూల కాలేజీల్లో వసతులు లేవని, ల్యాబులు, కేడావర్ల కొరత వంటి సమస్యలు వైద్య విద్య నాణ్యతను దెబ్బతీస్తున్నాయని ఈ రిపోర్టులో ఫైమా హెచ్చరించింది. ఈ సమస్యల పరిష్కారించాలని ఎన్ఎంసీని కోరింది.
