కంటి చూపు మెరుగైతున్నది.. నాగర్‌ కర్నూల్ జిల్లాలో తగ్గిన దృష్టి లోపాలు

కంటి చూపు మెరుగైతున్నది.. నాగర్‌ కర్నూల్ జిల్లాలో తగ్గిన దృష్టి లోపాలు
  • 25 ఏండ్లలో సగానికి పైగా తగ్గిన బాధితులు
  • 1998 లో 49.9 శాతం మందిలో సమస్యలు, 2023 నాటికి 20 శాతానికి తగ్గుదల
  • నిరక్షరాస్యులు, వయసు పైబడినోళ్లలోనే సమస్య ఎక్కువ
  • హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యుల స్టడీలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లాలో 25 ఏండ్ల కిందట ఊర్లకు ఊర్లనే వేధించిన కంటి చూపు సమస్య ఇప్పుడు సగానికి పైగా తగ్గింది. గ్రామాలకు చేరువైన వైద్యం, హాస్పిటల్స్ అందిస్తున్న చికిత్సలు, ప్రజల్లో పెరిగిన అవగాహనతో కంటి చూపు సమస్యలు తగ్గాయని హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ డాక్టర్లు చేసిన రీసెంట్ స్టడీ తేల్చి చెప్పింది. జిల్లాలో 40 ఏండ్లు దాటిన ప్రతి ఐదుగురిలో ఒకరు చూపు సమస్యతో బాధపడుతున్నా, గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గిందని వెల్లడైంది. అయితే వృద్ధులు, చదువుకోని వారిలో ఈ సమస్య ఇంకా తీవ్రంగానే ఉందని ఈ స్టడీ స్పష్టం చేసింది.

2,500 మందిని పరీక్షించి..
ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్ కు చెందిన డాక్టర్ శ్రీనివాస్ మర్మాముల నేతృత్వంలోని టీమ్ ఈ స్టడీ చేసింది. 2023 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాగర్‌ కర్నూల్ జిల్లాలోని 60 క్లస్టర్లలో ర్యాండమ్‌ గా 3 వేల మందిని ఎంపిక చేయగా, అందులో 2,570 మందికి వారి ఇండ్ల వద్దకే వెళ్లి కంటి పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ అసెస్‌ మెంట్ ఆఫ్ విజువల్ ఇంపెయిర్‌మెంట్ (ఆర్ఏవీఐ) అనే సైంటిఫిక్ పద్ధతి ఉపయోగించి ఈ డేటాను సేకరించారు. ఈ స్టడీలో కంటి సమస్య ఉన్నవారి శాతం 20.8%గా నమోదైంది. అంతకు ముందు 2014 లో నిర్వహించిన స్టడీలో 22.2 % మందిలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. అంతకు ముందు 1998 నిర్వహించిన స్టడీలో ఏకంగా 49.9% ఉండేది. అంటే, 1998 నుంచి 2023 వరకు కంటి సమస్య సగానికి తగ్గింది. 25 ఏండ్ల క్రితం ప్రతి ఇద్దరిలో ఒకరికి సమస్య ఉంటే, రీసెంట్ స్టడీలో ప్రతి ఐదుగురలో ఒకరికి ఈ సమస్య ఉందని తేలింది.

చదువుకోని వారిలో రెండున్నర రెట్లు ఎక్కువ
కంటి చూపు సమస్య తగ్గినప్పటికీ.. కొన్ని వర్గాల్లో ఈ సమస్య ఎక్కువగానే ఉందని స్టడీ తేల్చింది. జిల్లాలో 40 ఏండ్లు దాటిన వారిలో 22.68% మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయసు పైబడే కొద్దీ సమస్య తీవ్రమవుతున్నది. చదువుకున్న వారితో పోలిస్తే, చదువుకోని వారిలోనే ఈ సమస్య వచ్చే ప్రమాదం రెండున్నర రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. జీవనశైలి, ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, సరైన టైమ్‌ కు డాక్టర్‌ ను కలవకపోవడం వంటివి నిరక్షరాస్యులలో సమస్యను పెంచుతున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే జిల్లాల్లో సమస్యను చాలా వరకు తగ్గించవచ్చని వైద్యులు చెప్తున్నారు

గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు పెరిగాయి...
గతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతల్లో వైద్య సేవలు విస్తరించాయి. దీంతో కంటి చూపు సమస్యలకు త్వరగా వైద్యం లభిస్తున్నది. గతంలో పోలిస్తే సమస్య తీవ్రత తగ్గినప్పటికీ.. వృద్దులు, చదువుకోనివారిలో ఇంకా ఉన్నది. వారికి అవగాహన కల్పించడం అవసరం. కంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి చికత్స అందిస్తే నయం అవుతుంది. 

డాక్టర్ శ్రీనివాస్ మర్మాముల, ఎల్ వీ ప్రసాద్ ఇనిస్టిట్యూట్ 

క్యాటరాక్ట్ సమస్యలే ఎక్కువ..
ఎక్కువ శాతం మందిలో కంటి చూపు సమ్యలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు స్టడీలో గుర్తించారు. ఒకటి శుక్లాలు (కాటరాక్ట్). మొత్తం దృష్టి లోపం కేసుల్లో 66.2% దీనివల్లే వస్తున్నాయి. చిన్న ఆపరేషన్‌తో పూర్తిగా నయం చేయగలిగే సమస్య ఇది. రెండోది అన్ కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్.. ఈ సమస్య సరైన పవర్ ఉన్న కళ్లద్దాలు వాడకపోవడం వల్ల 26.8% మంది బాధపడుతున్నారు. ఇది కంటి పరీక్ష చేయించుకుని, కళ్లద్దాలు వాడటం ద్వారా సులభంగా పరిష్కరించవచ్చు.