- ఇక ప్రతినెలా ప్రియారిటీ కింద ఫండ్స్ విడుదల
- గత 10 రోజుల్లో రూ.4 వేల కోట్లు రిలీజ్
- సంక్షేమ పథకాలతో పాటు కాంట్రాక్టర్లు, ఉద్యోగులకి చెల్లింపులు
హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లులు, బకాయిల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ఆర్థిక శాఖ కొత్త పద్ధతిని ఎంచుకున్నది. అత్యంత ముఖ్యమైన అవసరాలకు ‘ప్రియారిటీ పేమెంట్’ (ప్రాధాన్యతా చెల్లింపు) విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నది. ఈ కొత్త విధానం అమలులో భాగంగా గత 10 రోజుల్లోనే ముఖ్యమైన వాటికి దాదాపు రూ.4 వేల కోట్ల పైన నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లు, విద్యార్థులకు సంబంధించి దీర్ఘకాలంగా పేరుకుపోయిన బకాయిలు, ఇతర సంక్షేమ పథకాల నిధులు ఒకేసారి క్లియర్ అయ్యాయి. అక్టోబర్ నెలలో రాష్ట్రానికి జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉండటం, అలాగే కొత్త ఎక్సైజ్ పాలసీలో దరఖాస్తులతోనే దాదాపు రూ.3 వేల కోట్లు రావడం, కొన్ని ప్రభుత్వ భూముల అమ్మకంతో వచ్చిన నిధులను ప్రభుత్వం వినియోగించుకుంది. అత్యవసరమైన, పేద ప్రజలకు, ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది.
ఇటీవల క్లియర్ చేసిన ముఖ్యమైన నిధులు
రూ.10 లక్షల లోపు బిల్లులను క్లియర్ చేయడంలో ప్రాధాన్యత ఇవ్వడంతో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖలలో పేరుకుపోయిన పెండింగ్ పనుల్లో కదలిక వచ్చింది. పంచాయతీరాజ్ పరిధిలోని రూ. 225 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థల్లో తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అత్యవసర పనులకు ఉపయోగపడనున్నాయి. అదేవిధంగా చిన్న రోడ్ల రిపేర్లు, మౌలిక వసతుల పనులు తిరిగి స్పీడప్కానున్నాయి.
గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లను క్లియర్ చేశారు. దశలవారీగా బకాయిలు చెల్లిస్తుండడంతో ఉద్యోగ వర్గాలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రూ.10 లక్షల లోపు విలువగల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలనే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం మేరకు, 46,956 బిల్లుల తాలూకు రూ.320 కోట్లను విడుదల చేశారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన 43,364 బిల్లులకు గాను రూ.225 కోట్లు, ఆర్ అండ్ బీ శాఖకు చెందిన 3,610 బిల్లులకు గాను రూ.95 కోట్లు ఉన్నాయి.
2022 నుంచి పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.303 కోట్లను రిలీజ్ చేశారు. ఈ నిధులు 2,288 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చాయి.
గిరిజన సంక్షేమ, జనరల్ గురుకులాలు, కేజీబీవీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యార్థుల భోజన, అద్దె, కాస్మోటిక్ చార్జీలకు సంబంధించిన సుమారు రూ.92 కోట్ల బకాయిలను రిలీజ్ చేశారు.
రూ. కోటి బిల్లులు కూడా రిలీజ్ చేసేలా..
చిన్న కాంట్రాక్టర్లకు ఊరట దక్కినప్పటికీ, రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువ గల బిల్లులు ఇంకా వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే, రూ.1 కోటి లోపు విలువ గల బిల్లులను కూడా తదుపరి ‘ప్రియారిటీ పేమెంట్’ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేసింది. ఆర్థిక వ్యవస్థలో పూర్తిస్థాయి సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే పెద్ద కాంట్రాక్టర్ల బకాయిలు కూడా క్లియర్ కావాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, విద్యార్థులకు, ఆరోగ్య శ్రీ వంటి ఇతర ముఖ్య పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు ‘దశలవారీగా ప్రతినెలా ప్రియారిటీ కింద నిధులు విడుదల’ విధానం అనుసరిస్తున్నారు. గత ప్రభుత్వ పెడింగ్పెట్టిన బిల్లుల భారాన్ని తగ్గించి, వ్యవస్థలో విశ్వాసం నింపాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఏ విభాగంలోనూ పెండింగ్ బిల్లుల కారణంగా ప్రజాసేవలు, అభివృద్ధి పనులు ఆగిపోకూడదని ప్రభుత్వం అధికారులను స్పష్టంగా ఆదేశించింది.
