హైదరాబాద్: వికారాబాద్ జిల్లా యాలాల్ హజ్పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయారు. ఈ దుర్ఘటన వారి ఇద్దరు కూతుర్లకు తల్లిదండ్రులను దూరం చేసింది. అమ్మానాన్న ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేక ఆ చిన్నారులిద్దరూ కన్నీరుమున్నీరయ్యారు. దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఆ చిన్నారులు ఏడుస్తున్న తీరు అక్కడున్న వాళ్లను కంటతడి పెట్టించింది. ఆ పిల్లలను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర కంకర టిప్పర్.. ఆర్టీసీ బస్సును ఢీ కొన్న ఘటనలో 19 మంది మృతి చెందిన ఘటన తెలంగాణలో పెను విషాదం నింపింది.
ఈ రోడ్డు ప్రమాదంలో తాండూరుకు చెందిన అక్కాచెల్లెళ్ళు ముగ్గురు మృతి చెందారు. సోమవారం ఉదయం తాండూరులో ట్రైన్ మిస్ కావడంతో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు బస్సు ఎక్కినట్లు తెలిసింది. ముగ్గురు కూతుర్లను తాండూరులో తండ్రి ఎల్లయ్య గౌడ్ బస్ ఎక్కించాడు. కానీ.. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు చదువుతున్నారు. ఈ ముగ్గురమ్మాయిలు ఇలా అకాల మరణం చెందడంతో కోఠి ఉమెన్స్ కాలేజీలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- అతివేగంతో బస్సును ఢీకొన్న కంకర లోడుతో వెళుతున్న టిప్పర్
- ఈ దుర్ఘటనలో కంకర మీద పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు
- ఇప్పటివరకూ 19 మంది ప్రయాణికులు మృతి
- ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు
- చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన
- బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం
- తాండూరు డిపోకు చెందిన బస్సుగా గుర్తించిన పోలీసులు
- తెల్లవారుజామున 4:59కి తాండూరు బస్ డిపో నుంచి బయల్దేరిన బస్సు
