చేవెళ్ల బస్సు ప్రమాదంపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడు నరసింహులు..

చేవెళ్ల బస్సు ప్రమాదంపై షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడు నరసింహులు..

సోమవారం ( నవంబర్  3 ) ఉదయాన్నే రాష్ట్రం ఉలిక్కిపడేలా చేసిన చేవెళ్ల బస్సు ప్రమాదంపై షాకింగ్ నిజాలు బయటపెట్టారు ప్రత్యక్ష సాక్షి, బస్సులో ప్రయాణిస్తున్న నరసింహులు. తాను ఉదయం 6 గంటల సమయంలో చేవెళ్ల మండలం అంతరం గ్రామం దగ్గర బస్సు ఎక్కానని.. మిర్జాగూడ దగ్గరికి రాగానే ప్రమాదం జరిగిందని తెలిపారు నరసింహులు. తాను కండక్టర్ వైపు నిల్చున్నానని.. బస్సు, టిప్పర్ రెండు మంచి స్పీడ్ లో ఉండగా ఢీకొన్నాయని తెలిపారు.

ఈ క్రమంలో బస్సు అద్దాలు పగిలి కంకర అంతా లోపలికి వచ్చిందని అన్నారు. బస్సులో రైట్ సైడ్ ఉన్నవారంతా మృతి చెందారని తెలిపారు నరసింహులు. ప్రమాదం జరిగిన తర్వాత పది నిమిషాల పాటు బస్సులోనే భయపడుతూ ఉండిపోయానని తెలిపారు. పోలీసులు త్వరగా వచ్చారని.. దేవుడి దయతో బయటపడ్డానని అన్నారు. చూస్తుండగా కొద్దీ క్షణాల్లోనే ప్రమాదం జరిగిపోయిందని తెలిపారు ప్రత్యక్ష సాక్షి నరసింహులు.

ఈ ఘటనపై సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి స్పందించారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నిర్మాణ పనుల కోసం కంకర లోడ్ తో టిప్పర్ వెళ్తోందని.. టిప్పర్ లోడ్ ఎక్కడికి తీసుకెళ్తోంది, టిప్పర్ ఓనర్ ఎవరు వంటి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు.

తాండూర్ నుండి హైదరాబాద్ బయలుదేరిన ఈ బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారని.. ప్రమాదంలో 21 మరణించారని వెల్లడించారు సీపీ అవినాష్ మొహంతి. కొంతమంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యిందని.. ప్రమాదంలో గాయపడ్డవారికి చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి, పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారని తెలిపారు.