- మక్కజొన్నల కొనుగోలు లక్ష్యం పెంపు
- సవరించిన లక్ష్యం 1.5 లక్షల టన్నులు
- దళారులకు అమ్మిన నష్టపోతున్న రైతులు
నిర్మల్, వెలుగు: అధికారుల లెక్కలు తప్పడంతో నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న పంట కొనుగోళ్ల లక్ష్యం దాటింది. సంబంధిత వ్యవసాయ అధికారులు పంట సాగు వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడంతో మొక్కజొన్న దిగుబడి లక్ష్యాన్ని 1,20,000 మెట్రిక్ టన్నులుగా నిర్ధారించారు. కానీ వారి అంచనాకు మించి భారీ ఎత్తున మొక్కజొన్న పంట మార్కెట్ కు తరలిరావడంతో.. తప్పును గుర్తించిన అధికారులు లక్ష్యాలను సవరించుకున్నారు. 1,50,000 మెట్రిక్ టన్నులుగా పంట కొనుగోలు లక్ష్యాన్ని ఖరారు చేశారు.
టార్గెట్‌కు మించి రైతుల వద్ద పంట
మక్కజొన్న కొనుగోళ్ల కోసం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మొదట అనుకున్న 1.20 లక్షల మెట్రిక్‌టన్నుల టార్గెట్కంటే ఎక్కువ మొత్తంలో పంట కొనుగోలు కేంద్రాలకు తరలివచ్చింది. దీంతో తాము చేసిన తప్పును గుర్తించిన అధికారులు లక్ష్యాన్ని సవరించారు. సవరించిన లక్ష్యం అనంతరం ఇప్పటివరకు 1,43,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.
సవరించిన లక్ష్యం మేరకు మరో ఏడు టన్నుల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ రైతుల వద్ద అంతకుమించి పంట ఉన్నట్లు తెలుస్తోంది. అంచనాకు మించి పంట కొనుగోలు కేంద్రాలకు రావడం, రోజుల తరబడి పంటను నిల్వ ఉంచలేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ.1600కే అమ్ముకుంటూ నష్టపోతున్నారు.
వేగం పుంజుకోని వడ్ల కొనుగోళ్లు
జిల్లాలో కలెక్టర్ స్థాయి నుంచి సంబంధిత అధికారులంతా పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నప్పటికీ వరి ధాన్యం కొనుగోలు మాత్రం వేగం పుంజుకోవడం లేదు. మొత్తం 1,83,980 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 77,904 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. మిగిలిన 1,06,076 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది.
కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించడంలో జాప్యం జరుగుతోంది. వాహనాల కొరత వల్ల ధాన్యాన్ని తరలించడం అధికారులకు సమస్యగా మారింది. దీనికి తోడు రైస్ మిల్లులో సైతం భారీ ఎత్తున వరి ధాన్యం నిల్వలు పేరుకుపోవడం, గిడ్డంగుల కొరత పంట తరలింపులో ఆలస్యానికి కారణమవుతున్నాయి.
