- ఉగ్రవాదులను.. మజ్లిస్పెంచి పోషిస్తున్నది
- పవర్ కోసం ఆ పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతిస్తున్నయ్
- ప్రజల ప్రాణాల కంటే ఆ పార్టీలకు అధికారమే ముఖ్యం
- ఉగ్రవాద కార్యకలాపాలపై సీఎం ఎందుకు రివ్యూ చేయరు?
- అవినీతి తిమింగలం సోమేశ్కు చీఫ్ అడ్వయిజర్ పోస్ట్ ఎట్లిస్తరు?
- కేసీఆర్.. 22వ పులకేశిలా వ్యవహరిస్తున్నడు
- దమ్ముంటే ఓఆర్ఆర్ టెండర్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి: సంజయ్
- ఈ నెల 15 తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన
హైదరాబాద్, వెలుగు: ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ ఆశ్రయమిస్తున్నదని, రెండు రోజుల కింద అరెస్టయిన సలీం.. మజ్లిస్ చీఫ్ ఒవైసీకి చెందిన డెక్కన్ మెడికల్ కాలేజీలో శాఖాధిపతిగా పని చేయడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ‘‘2016 జులైలో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయపోరాటం చేస్తానని ఒవైసీ అప్పట్లో ప్రకటన చేసిండు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ దీనిపై ఎందుకు సమీక్ష చేయడం లేదు. హైదరాబాద్ సిటీని టెర్రరిస్టులకు షెల్టర్ జోన్‌గా మార్చారు” అని అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఓటు బ్యాంకు కోసం, అధికారం కోసం మజ్లిస్‌తో బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటకాగుతున్నాయని దుయ్యబట్టారు. ‘‘హిజ్బు ఉత్ తహరీర్ (హెచ్‌యూటీ) సంస్థ ఉగ్రవాదులను రెండ్రోజుల కింద హైదరాబాద్‌లో పట్టుకున్నరు. ఈ సంస్థ ఐసిస్ కన్నా ప్రమాదకరమైంది. జీవ, రసాయన ఆయుధాలతో దాడులు చేస్తూ భయోత్పాతం సృష్టిస్తుంది. హెచ్‌యూటీ టెర్రరిస్టులు అనంతగిరి కొండలను శిక్షణా కేంద్రంగా చేసుకున్నరు. డ్రోన్ ద్వారా ఆపరేట్ చేస్తున్నరు” అని తెలిపారు.
రోహింగ్యాలకు ఓల్డ్ సిటీ షెల్టర్ జోన్ గా మారిందని తాము అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నామని, ఇప్పుడు అది నిజమైందని అన్నారు. ‘‘ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మను 52 సార్లు పొడిచిన ఉగ్రవాదికి హైదరాబాద్‌లో షెల్టర్ ఇచ్చారు. పీఎఫ్ఐకి షెల్టర్ జోన్ ఎంఐఎం. రాజకీయాల కోసం ఉగ్రవాదులను మజ్లిస్ పెంచి పోషిస్తుంటే... ఓ వర్గం ఓట్ల కోసం ఆ పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతిస్తున్నయ్” అని ఆరోపించారు. ప్రజల ప్రాణాల కంటే ఆ పార్టీలకు అధికారమే ముఖ్యమని మండిపడ్డారు. ఇన్నాళ్లూ లవ్ జిహాద్ మాత్రమే అనుకున్నామని, ఇప్పుడు కొత్త రకం జిహాద్ నడుస్తున్నదని అన్నారు. ‘‘హిందూ యువకులను బెదిరించి ముస్లింలుగా మార్చి..వారిని టెర్రరిస్టులుగా తయారు చేసి హింసకు పాల్పడుతూ హిందువులు కూడా టెర్రరిస్టులే అనే ముద్ర వేయాలనే లక్ష్యంతో మజ్లిస్ ఉంది” అని ఆరోపించారు. తెలంగాణలో శాంతి భద్రతల సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా ఉగ్రవాద కార్యకలాపాలపై సీఎం సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
జేపీఎస్‌ల సమ్మెకు పూర్తి మద్దతు
జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మెకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని సంజయ్ తెలిపారు. ఓఆర్ఆర్ 30 ఏండ్ల లీజుపై అవినీతి లేదని, సీబీఐ విచారణకు సిద్ధమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ జరపాలని లేఖ రాయాలి” అని సవాల్ చేశారు.
ఇయ్యాల సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్
నిరుద్యోగుల పక్షాన గురువారం సంగారెడ్డిలో ‘నిరుద్యోగ మార్చ్’ను నిర్వహిస్తామని సంజయ్ తెలిపారు. దీనిపై ఉమ్మడి మెదక్ జిల్లా పోలింగ్ బూత్ కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలోనే హైదరాబాద్ లో కూడా నిరుద్యోగ మార్చ్ ను నిర్వహిస్తామని సంజయ్ చెప్పారు. కాగా, ఈ నెల 15 తర్వాత సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌ను బీజేపీ ఖరారు చేసింది.
అవినీతి సోమేశ్కు పదవి ఇచ్చుడేంది?
‘‘సీఎంకు చీఫ్ అడ్వయిజర్‌గా నియమితులైన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ఓ అవినీతి తిమింగలం. హైకోర్టు మొట్టికాయలు వేసి ఇక్కడి నుంచి ఆయనను తీసేస్తే..ఇప్పుడు మళ్లీ కేసీఆర్ తెచ్చిపెట్టుకున్నడు. ఇక సోమేశ్ రాజ్యాంగేతర శక్తిగా మారబోతున్నడు” అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలకు ఆద్యుడు సోమేశ్కుమారేనని, అన్ని అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్య సలహాదారుడిగా నియమించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. 22వ పులికేశి మాదిరి కేసీఆర్ వ్యవహరిస్తున్నడని విమర్శించారు.