మమతా బెనర్జీకి రెబల్స్ మరో షాక్.. పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ కు రిక్వెస్ట్!

మమతా బెనర్జీకి రెబల్స్ మరో షాక్.. పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ కు రిక్వెస్ట్!

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దీదీ సామ్రాజ్యం బీటలు వారుతోంది. మెల్లగా పార్టీ చేజారిపోతోంది. వరుసగా 15 ఏళ్ల పాటు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్(TMC) కోట.. 2026 అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయంతో పేకమేడలా కూలిపోతోంది. 294 సీట్లలో కేవలం 80 సీట్లకే పరిమితమైన టీఎంసీలో ఇప్పుడు అంతర్గత పోరుతో కుర్చీ లాట నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని విధంగా ఆమె మాజీ నమ్మకస్థుడే మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చాడు.

బ్యాంక్ అకౌంట్ లాక్ చేయండి బాస్
టీఎంసీ మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ అరూప్ బిశ్వాస్.. HDFC బ్యాంక్‌కు ఒక సంచలన లేఖ రాశారు. ప్రస్తుతం పార్టీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయని, ఎవరి చేతిలో కంట్రోల్ ఉందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని పేర్కొంటూ.. వెంటనే టీఎంసీ అధికారిక బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. పార్టీ ఫండ్స్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

దీదీ చేజారిన ఎమ్మెల్యేలు, ఎంపీలు..
తాను ఇప్పటికీ టీఎంసీ ట్రెజరర్‌నని చెప్పుకుంటూ అరూప్ బిశ్వాస్ రాసిన ఈ లేఖలో కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. పార్టీకి చెందిన 28 మంది పార్లమెంట్ సభ్యులలో ఏకంగా 20 మంది, అలాగే 90 మంది ఎమ్మెల్యేలలో 58 మంది ఇప్పటికే పార్టీని వీడారని లేదా ప్రస్తుత నాయకత్వంపై బహిరంగంగా తిరుగుబాటు చేశారని బాంబు పేల్చారు. సంతకాలు చేసిన చెక్కులు తిరుగుబాటు నాయకుల చేతుల్లో ఉన్నాయని, అవి తప్పుడు చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్విస్ట్ ఏంటంటే.. ఆయన ట్రెజరరే కాదు
కానీ ఇక్కడే ఒక అసలైన క్రేజీ ట్విస్ట్ ఉంది. జూన్ 5న జరిగిన ఎన్నికల్లో టోలీగంజ్ సీటులో అరూప్ బిశ్వాస్ ఓడిపోవడంతో.. మమతా బెనర్జీ ఆయనను ట్రెజరర్ పదవి నుంచి ఎప్పుడో పీకేశారు. ఆయన స్థానంలో సుభాషిష్ చక్రవర్తిని నియమించారు. పదవి పోయినా సరే.. పాత హోదాతోనే అరూప్ బ్యాంకుకు లేఖ రాయడం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల చేతుల్లోనే పవర్ అంతా కేంద్రీకృతమైందంటూ తిరుగుబాటుదారులు దీదీపై కత్తులు నూరుతున్నారు.

మెస్సీ టూర్ స్కామ్, దోపిడీల మకిలి..
ఈ అరూప్ బిశ్వాస్ ట్రాక్ రికార్డ్ కూడా మామూలుగా లేదు. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ కోల్‌కతా టూర్‌కు వచ్చినప్పుడు జరిగిన గొడవలకు ఈయనే కారణమంటూ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దాదాపు 22వేల కాంప్లిమెంటరీ టిక్కెట్లను బెదిరించి వసూలు చేసి, వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బీజేపీ నేత దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. మెస్సీని అవమానించి, బెంగాల్ పరువు తీశారు" అని మండిపడ్డారు. దీనికి తోడు అరూప్ సోదరుడు స్వరూప్ బిశ్వాస్ కూడా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దోపిడీ రాకెట్ నడుపుతూ దొరికిపోయి జైల్లో ఉన్నాడు. మొత్తానికి సొంత పార్టీ నేతల తిరుగుబాటు, అవినీతి మరకలతో దీదీ పరిస్థితి కత్తిమీద సాములా మారింది బెంగాల్ లో.