 
                                    - మొంథా ఎఫెక్ట్.. విద్యుత్ శాఖకు భారీ నష్టం
- రంగంలోకి డిస్కం సీఎండీలు.. పునరుద్ధరణ చర్యలు స్పీడప్
హైదరాబాద్, వెలుగు: మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సదరన్ డిస్కం పరిధిలో 456 కరెంట్ పోల్స్, 29 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా నల్గొండ జిల్లాలో విద్యుత్ శాఖకు నష్టం జరిగింది. అదేవిధంగా, వరంగల్ కేంద్రంగా ఉన్న నార్తర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో 428 విద్యుత్ స్తంభాలు కూలిపోగా, 8 సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయి. డిస్కంల సీఎండీల పర్యవేక్షణలో వేగంగా విద్యుత్ వ్యవస్థ పున:రుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు పూర్తికాగా ఇంకొన్ని పురోగతి దశలో ఉన్నాయి.
సదరన్ డిస్కం పరిధిలో..
సౌత్ డిస్కం పరిధిలో 456 కరెంట్ పోల్స్, 29 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మరమ్మతు పనులు చేపట్టి గురువారం రాత్రికల్లా అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. నల్గొండ జిల్లాలో 197 లో టెన్షన్ కరెంట్ పోల్స్, 11 కేవీ పోల్స్ 82, 23 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 105 పోల్స్, సూర్యాపేటలో 42 పోల్స్ దెబ్బతిన్నాయి. కంబాలపల్లి, అక్కారం, తెల్దారుపల్లి, చెరుకుపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్లకు సంబంధించిన 33 కేవీ ఫీడర్లు దెబ్బతినడంతో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తెల్దారుపల్లి, చెరుకుపల్లి సబ్ స్టేషన్లలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
నార్తర్న్ డిస్కం పరిధిలో..
వరంగల్ కేంద్రంగా ఉన్న నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధిలో మొంథా తుఫాను ప్రభావంతో 428 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. 8 సబ్ స్టేషన్ లు నీట మునిగాయి. అందులో 6 సబ్ స్టేషన్లను పునరుద్ధరించారు. మిగిలిన 2 సబ్ స్టేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు: సీఎండీ ముషారఫ్ ఫారూఖీ
యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. డైరెక్టర్లతో కలిసి గురువారం నల్గొండ జిల్లాలో ఆయన పర్యటించారు. డిండి ప్రాంతంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. సిబ్బంది మొత్తం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో బిజీగా ఉందన్నారు. భారీ వర్షంలో సిబ్బంది రాత్రింబవళ్లు పనిచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు నార్తర్న్ డిస్కం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు.

 
         
                     
                     
                    