- ఇవాళ్టితో ముగియనున్న నామినేషన్ల గడువు
- ఇప్పటివరకు అభ్యర్థులను కన్ఫామ్ చేయని పార్టీలు
- పొత్తుల కసరత్తు పూర్తి కాకపోవడమే కారణం
- ముందు నామినేషన్లు వేయాలంటూ సూచన
- బీఫామ్వస్తుందో.. లేదోనని అభ్యర్థుల ఆందోళన
- కాంగ్రెస్, సీపీఐ అసంతృప్తులకు గాలం వేసే పనిలో బీఆర్ఎస్
ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు మరికొద్ది గంటల్లో ముగియనుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ఘట్టం ముగుస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులకు టికెట్లు కేటాయించలేదు.. కానీ నామినేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ఏదులాపురంలో కాంగ్రెస్ మినహా, ఏ పార్టీలవారు అభ్యర్థులను ప్రకటించలేదు. ఆశావహులు మాత్రం పార్టీల పేరున నామినేషన్లు వేస్తున్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్‌తోపాటు ఏదులాపురం, సత్తుపల్లి, వైరా, మధిర, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలు నామినేషన్లకు వచ్చే అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్, ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్, సీపీఐ పొత్తుల చర్చలు కీలక దశలో ఉన్నట్టుగా ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. పొత్తులు పూర్తి స్థాయిలో కన్ఫామ్ కాకపోవడం, పొత్తులపై అంగీకారానికి వచ్చినా అభ్యర్థి ఎంపిక ఫైనల్ కాకపోవడంతో అధికారికంగా ప్రకటించడం లేదు. పొత్తుల నేపథ్యంలో కాంగ్రెస్, సీపీఐ రెబల్ అభ్యర్థులకు గాలం వేసే పనిలో బీఆర్ఎస్ నిమగ్నమైంది.
నామినేషన్లకు ఇవాళ చివరి రోజు..
నామినేషన్లకు ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. పార్టీల మధ్య పొత్తులు కుదిరితే నామినేషన్‌వేసిన తమ పరిస్థితి ఏంటనే టెన్షన్లో పలువురు అభ్యర్థులు ఉన్నారు. పొత్తుల సంగతి తర్వాత ముందైతే మీరు మాత్రం నామినేషన్లు వేయండంటూ పార్టీల నుంచి గ్రీన్సిగ్నల్రావడంతో ఆశావహులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. విత్ డ్రా టైం వరకు పొత్తులు కుదిరి, తమకు టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదరకపోతే.. సీపీఐతో పొత్తు పెట్టుకునేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. మరోవైపు పొత్తులు కుదిరితే టికెట్ఆశించి భంగపడ్డ అసంతృప్తులను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మకాం వేసి అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు.
అశ్వారావుపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్, టీడీపీ మధ్య పొత్తు కుదిరింది. మధిర మున్సిపాలిటీలో ఇంతవరకు పార్టీలవారీగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. బీఆర్ఎస్, సీపీఎం పొత్తుతో పోటీలో దిగగా, కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ పొత్తుతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్, సీపీఎం కలిసి పోటీ చేస్తున్నాయి. ఏదులాపురంలో కాంగ్రెస్, సీపీఐ చర్చలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి.
సామాజిక సమీకరణాలు సెట్..
సత్తుపల్లి రాజకీయాల్లో ఇన్నేండ్లుగా ప్రధాన నాయకులుగా వ్యవహరించిన వారికి ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో చుక్కెదురైనా, చివరలో అలకలు, బుజ్జగింపుల పర్వంతో సామాజిక సమీకరణాలు సెట్ అయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులకు పరాభవం ఎదురైంది. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఆశించిన వారు, కనీసం కౌన్సిలర్ సీటుకు కూడా నోచుకోలేదు.
ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త దయానంద్‌కు అత్యంత సన్నిహిత మిత్రులు ఇద్దరు వారి భార్యలను బరిలోకి దింపుతున్నట్లు ప్రచారం చేసినా వారు కూడా చాలించుకున్నారు. అనూహ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా ఉన్న ఓ వ్యక్తి కుటుంబంలో తల్లి, కొడుకులకు టికెట్లు ఇవ్వడం వల్ల పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది.
మేయర్, చైర్మన్ల సంగతి తర్వాత చూద్దాం..!
కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్‌కార్పొరేషన్ మేయర్‌తోపాటు డిప్యూటీ మేయర్, మిగిలిన మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలపై ప్రధాన పార్టీల నేతలు కన్నేశారు. పోటీ తీవ్రంగా ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ఆ పదవుల విషయాన్ని పక్కన పెట్టాయి. ముందైతే కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో గెలవండి, తర్వాత పదవుల సంగతి చూద్దామంటూ ప్రధాన పార్టీల నేతలు ఆశావహులకు సూచిస్తున్నాయి. దీంతో ముందు టికెట్కన్ఫామ్ చేసుకునే పనిలో అభ్యర్థులు ప్రధాన పార్టీల నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.
