కర్నాటకలో పోలింగ్​ నేడే ..     58,545 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు 

కర్నాటకలో పోలింగ్​ నేడే ..     58,545 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు 

 

  • లక్షన్నర మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు
  • 224 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2,615 మంది అభ్యర్థులు పోటీ
  • రాష్ట్రంలో 5.31 కోట్ల మంది ఓటర్లు  
  • 58,545 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు 
  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం 

 

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ హోరాహోరీ ప్రచారం ముగిసిన తర్వాత రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్​కు రంగం సిద్ధమైంది. ప్రధాని మోడీ మ్యాజిక్ తో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డగా.. ఈసారి ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించింది. రాష్ట్రంలో ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే మరోసారి కింగ్ మేకర్ పాత్ర పోషించాలని జేడీఎస్ ముమ్మర ప్రచారం చేసింది. కన్నడ ఓటరు తీర్పు ఏమిటన్నది శనివారం వెల్లడికానుంది.  

బరిలో 2,615 మంది అభ్యర్థులు 

రాష్ట్రంలో మొత్తం 224 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 2,430 మంది మేల్ క్యాండిడేట్స్, 184 మంది ఫీమేల్ క్యాండిడేట్స్, ఒకరు థర్డ్ జెండర్ క్యాండిడేట్ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 

1.56 లక్షల మంది పోలీసులతో భద్రత 

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా 1.56 లక్షల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. వీరిలో 84,119 మంది రాష్ట్ర పోలీసులు కాగా, మిగతా వారిని ఇతర రాష్ట్రాల నుంచి విధుల్లోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. మొత్తం 304 మంది డీఎస్పీలు, 991 మంది సీఐలు, 20,601 మంది ఎస్ఐలతో పాటు 650 కంపెనీల సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం వివరించింది. 

మెట్రో టైమింగ్స్ పెంపు

అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నేపథ్యంలో బుధవారం మెట్రో టైమింగ్స్ ను పెంచుతున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్సీఎల్) వెల్లడించింది. పోలింగ్ రోజున అర్దరాత్రి వరకూ మెట్రో సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది. బ్యాపనహళ్లి, కెంగెరి, నాగసంద్ర, సిల్క్ ఇనిస్టిట్యూట్, కేఆర్ పురం, వైట్ ఫీల్డ్ టెర్మినల్స్ నుంచి లాస్ట్ మెట్రో ట్రెయిన్ అర్ధరాత్రి దాటాక 12.05 గంటలకు బయలుదేరుతుందని పేర్కొంది. అలాగే నాదప్రభు కెంపెగౌడ స్టేషన్ (మెజెస్టిక్) నుంచి 12.35 గంటలకు లాస్ట్ మెట్రో సర్వీస్ ఉంటుందని వివరించింది. 

గోవాలో సెలవు.. ప్రతిపక్షాల మండిపాటు  

కర్నాటక ఎన్నికల సందర్భంగా బుధవారం గోవా ప్రభుత్వం పెయిడ్ హాలీడేను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ సంస్థలు, ఇండస్ట్రీల వర్కర్లకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, కర్నాటకలో ఎన్నికలు జరిగితే గోవాలో సెలవు ప్రకటించడం ఏమిటంటూ ప్రతిపక్షాలు, ఇండస్ట్రీ వర్గాలు సీఎం ప్రమోద్ సావంత్ సర్కార్ పై మండిపడ్డాయి. ఈ హాలీడేను వ్యతిరేకిస్తూ తాము కోర్టును ఆశ్రయిస్తామని గోవా స్టేట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే, పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు గోవాలో సెలవును ప్రకటించడం సాధారణ విషయమేనని సీఎం ఆఫీస్ స్పష్టం చేసింది. పోయిన ఏడాది గోవాలో ఎన్నికలు జరిగినప్పుడు కర్నాటకలో కూడా ఇలాగే సెలవును ప్రకటించారని గుర్తు చేసింది.