- జీడబ్ల్యూఎంసీ కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలు
- వరుస విజయాలతో జోష్ మీదున్న హస్తం పార్టీలోకి జంపింగ్ లు
- మూడు నెలల్లో ముగియనున్న పాలకవర్గ పదవీకాలం
హనుమకొండ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో గ్రేటర్ వరంగల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. తాజాగా జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక స్థానాలను హస్తం పార్టీ చేజిక్కించుకోగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేసింది. ఓ వైపు పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ.. మరోవైపు మున్సిపాలిటీల్లోనూ సేమ్ సీన్ రిపీట్ కావడంతో హస్తం పార్టీలో జోష్ పెరిగింది.
దీంతో మరో మూడు నెలల్లో ఎలక్షన్స్ జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్న ఆశావహులు ఇప్పటినుంచే కాంగ్రెస్ బాట పడుతున్నారు. మే 7వ తేదీతో జీడబ్ల్యూఎంసీ పాలకవర్గ పదవీకాలం ముగియనుండగా, ఆశావహులు క్యూ కడుతుండటంతో కాంగ్రెస్ లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది.
కాంగ్రెస్ లో డబుల్ జోష్..
ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అత్యధిక స్థానాలను దక్కించుకుని పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చింది. గతంలో పదేండ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు స్థానాలకే పరిమితం కాగా, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత డిసెంబర్ లో ఉమ్మడి జిల్లాలోని 1,493 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో 989 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు.
బీఆర్ఎస్ 475, బీజేపీ 26, సీపీఎం 2 చోట్ల మాత్రమే విజయం సాధించాయి. దాదాపు 70 శాతం పంచాయతీల్లో కాంగ్రెస్ సత్తా చాటగా, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జీడబ్ల్యూఎంసీ మినహా మిగతా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా, అన్ని చైర్పర్సన్ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
హస్తం పార్టీ నుంచి పోటీకి క్యూ..
ఈ ఏడాది మే 7తో జీడబ్ల్యూఎంసీ పాలకవర్గ పదవీకాలం ముగియనుంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కనిపిస్తుండటం, బీఆర్ఎస్, బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో హస్తం పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి. ఇప్పటికే వరంగల్ వెస్ట్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు షురూ అయ్యాయి. ఇదిలాఉంటే గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లను 88కి విస్తరించే అవకాశం కనిపిస్తుంది.
దాంతో పాటు మేయర్ సీటు జనరల్ కు కేటాయించగా, గతంతో పోలిస్తే బీసీలకు ఎక్కువ సీట్లు రిజర్వ్ అయ్యే ఛాన్స్ ఉండటంతో కొత్తగా కార్పొరేటర్ బరిలో నిలిచేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ఆశావహులు అధికార కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటినుంచే కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేయడంతో పాటు యూత్ లు, కులసంఘాలతో మంతనాలు కూడా మొదలుపెట్టారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఓ వైపు కార్పొరేటర్ గా అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు కొత్త నేతలు తెరమీదకు వస్తుండటం, ఇప్పటినుంచే టికెట్ల కోసం క్యూ కడుతుండటంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఎవరెవరికి దక్కుతుందో చూడాలి.
గ్రేటర్ లోనూ పెరిగిన బలం..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 66 డివిజన్లకు 2021 ఏప్రిల్ 30 ఎన్నికలు జరగగా, మే 7న పాలకవర్గం కొలువుదీరింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అత్యధికంగా 48 డివిజన్లు గెలుచుకోగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 10 డివిజన్లు సొంతం చేసుకోగా, మరో మూడు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఆ తర్వాత ఇద్దరు ఇండిపెండెంట్లు, బీజేపీకి చెందిన ఒక కార్పొరేటర్ బీఆర్ఎస్ లోకి చేరగా, గులాబీ పార్టీకి 51 సీట్ల మెజార్టీ దక్కింది.
కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రేటర్ పరిస్థితులు మారిపోయాయి. గ్రేటర్ పరిధిలో మంత్రి కొండా సురేఖ దంపతులు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవతో కాంగ్రెస్ బలం పెరిగిపోయింది. బీఆర్ఎస్ నుంచి మేయర్ పదవి దక్కించుకున్న గుండు సుధారాణి సహా పలువురు కార్పొరేటర్లు ఇదివరకే కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మరికొందరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు.
