భూనిర్వాసితుల ఓట్లు ఎటువైపు​?

భూనిర్వాసితుల ఓట్లు ఎటువైపు​?
  • అన్ని పార్టీల ముమ్మర ప్రయత్నాలు
  • గజ్వేల్‌లో మల్లన్న సాగర్, కొండపోచమ్మ
  • హుస్నాబాద్‌లో గౌరవెల్లి బాధితులు

సిద్దిపేట, వెలుగు: జిల్లాలోని గజ్వేల్ సెగ్మెంట్‌లో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, హుస్నాబాద్ సెగ్మెంట్‌లో గౌరవెల్లి ప్రాజక్ట్​ నిర్వాసితుల  ఓట్లు పొందేందుకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు సెగ్మెంట్ల పరిధిలోని మూడు ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 20 వేల పై చిలుకు నిర్వాసిత ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ముఖ్యంగా గజ్వేల్ సెగ్మెంట్‌ పరిధిలోని కొండ పోచమ్మ సాగర్​కు సంబంధించి ఐదు వేలు, మల్లన్న సాగర్ 10 వేల పైచిలుకు ఓట్లు ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. తొగుట మండలం లో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురైన  తొమ్మిది గ్రామాలతో పాటు మరో నాలుగు మధిర గ్రామాల్లోని 4500 కుటుంబాలను గజ్వేల్ పట్టణ సమీపంలోని ముట్రాజ్ పల్లి వద్ద నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించారు. 

దాదాపు పదివేల నిర్వాసితుల ఓట్లను గజ్వేల్ సెగ్మెంట్‌లో నమోదు చేయించారు. మర్కుక్ మండలంలో  కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్  నిర్మాణంతో నాలుగు గ్రామాలు ముంపునకు గురికాగా ములుగు మండలంలోని తునికి ఖల్సా వద్ద నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి తరలించారు. దాదాపు  ఐదు వేల ఓటర్లు గజ్వేల్ సెగ్మెంట్‌లో పరిధిలో ఉన్నారు.  

నిర్వాసితులకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లతో పాటు పరిహారాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటి కోసం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు వారి మద్దతు పొందేందుకు పోటా పోటీగా హామీలు ఇస్తున్నాయి.  

పలు దఫాలుగా సమావేశాలు

సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ సెగ్మెంట్‌లో నిర్వాసితుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉండడంతో బీఆర్ఎస్ నేతలు వారి మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పెండింగ్ పరిహారాల కోసం మల్లన్న సాగర్ కు సంబంధించి 13 గ్రామాల ప్రజలు కొంత కాలంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నా ఎప్పటికప్పుడు  అధికారులు హామీలతో వాయిదా వేస్తూ వచ్చారు.  

రెండు నెలల క్రితం ఏకంగా సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ ముట్టడికి ప్రయత్నాలు చేశారు. సమస్యల పరిష్కారానికి మౌఖిక హామీ ఇచ్చినా అమలుకాకపోవడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లన్న సాగర్ నిర్వాసితులతో మంత్రి హరీశ్​రావు  ప్రత్యేకంగా సమావేశమై పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని కోరారు. 

ఇటీవల సీఎం కేసీఆర్ షామీర్ పేటలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమైనప్పుడు నిర్వాసితుల కోర్కెలు న్యాయమైనవేనని వంద శాతం వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి సైతం వారితో సమావేశమై సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చి తమకు మద్దతు తెలపాలని కోరడం గమనార్హం. 

గౌరవెల్లి నిర్వాసితుల్లో ఆగ్రహావేశాలు

హుస్నాబాద్ సెగ్మెంట్‌లో నిర్మించిన గౌరవెల్లి ప్రాజక్టు నిర్మాణంతో గుడాటిపల్లి తో పాటు మధిర గ్రామాలు ఐదు ముంపునకు గురయ్యాయి. ఈ ప్రాజెక్ట్​ వల్ల దాదాపు ఆరు వందలకు పైగా కుటుంబాలు చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయారు.  వారికి సంబంధించిన పరిహారాలు పెండింగ్ లో ఉన్నాయి. అధికారులు స్పందించక పోవడంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గౌరవెల్లి ప్రాజక్టు ముంపు గ్రామాలకు సంబంధించి దాదాపు 2500 ఓట్లు ఉండగా, వారిలో దాదాపు 1500 మంది సమీప గ్రామాల్లో నివాసం ఏర్పరచుకున్నారు. 

మిగిలిన వెయ్యి మంది ఓటర్లు దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు.  వారి ఓట్లు ఏ పోలింగ్ బూత్​లో ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.  ఈ నేపథ్యంలో కొందరు నేతలు వారు ఓటింగ్ లో పాల్గొనే విధంగా సంప్రదింపులు జరుపుతూ వారి పోలింగ్ బూత్ ల వివరాలు సేకరిస్తున్నారు. నిర్వాసితుల ఓట్లు పొందేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటా పోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

గజ్వేల్ బరిలో నిర్వాసితులు

సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ సెగ్మెంట్‌లో  పలువురు నిర్వాసితులు ఎన్నికల బరిలో నిలిచారు. మల్లన్న సాగర్ నిర్వాసితులు ఇద్దరు, కొండ పోచమ్మ సాగర్ నిర్వాసితులు ఇద్దరు పోటీలో ఉన్నారు.  వీరిని విత్​ డ్రా చేయించడానికి ట్రై చేసినా వారు ససేమిరా అనడంతో ప్రస్తుతం ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు. 

నిర్వాసితుల సమస్యలను ప్రజలకు తెలియజేయడం కోసమే తాము గజ్వేల్ ఎన్నికల బరిలో నిలిచినట్టు చెబుతున్నారు.  ఇదిలా ఉంటే గౌరవెల్లి  ప్రాజక్టు నిర్వాసితులు 8  మంది హుస్నాబాద్ సెగ్మెంట్‌లో నామినేషన్లు వేశారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సూచనతో విత్​ డ్రా చేసుకున్నారు.