మాల ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు అభినందనీయం.. బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది

మాల ఎడ్యుకేషనల్  సొసైటీ ఏర్పాటు అభినందనీయం.. బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది
  • మాలల ఎడ్యుకేషన్ వెల్ఫేర్​కు తోడ్పడుతుంది 
  • మంత్రి వివేక్ ​వెంకటస్వామి     

శంషాబాద్, వెలుగు :  విద్యా రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉన్న మాలలకు అవసరమైన సాయం చేయడానికి ఒక మంచి ఆలోచనతో మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేశారని మంత్రి వివేక్ ​వెంకటస్వామి అన్నారు.  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని షాపూర్ ఎస్వీ రెడ్డి గార్డెన్ లో మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సమావేశం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై అంబేద్కర్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా వివేక్​మాట్లాడుతూ మాల ఉద్యోగులు అంతా కలిసి ఎంఈడబ్ల్యూఎస్​ ఏర్పాటు చేయడం అభినందనీయమని, దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాని కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు.  

మాలలది కష్టపడే తత్వమని, అందరికోసం పనిచేసే స్వభావం ఉన్నవారన్నారు. విద్యార్థులందరికీ ఫీజులు కట్టే స్థోమత ఉండదని, అలాంటి వారికి అండగా నిలవాలన్నారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో పేద విద్యార్థులకు రూ.500 నుంచి రూ.వెయ్యి డొనేట్ చేస్తే వారి జీవితాలకు బాటలు వేసినవారవుతారన్నారు. ఈ సందర్భంగా రూపొందించిన వెబ్ సైట్​ను మంత్రి ప్రారంభించారు. 

మాలలు ఎవరికైనా హెల్త్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్​ ఇతర సమస్యలుంటే వెబ్​సైట్​నుంచి చెప్పుకునే వెసులుబాటు ఉందని, దీనివల్ల సాయం త్వరగా అందుతుందని ఎంఈడబ్ల్యూఎస్​అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. ఎంఈడబ్ల్యూఎస్ ​ప్రధాన కార్యదర్శి చెన్నయ్య,  ట్రెజరర్ ​నిమ్మ నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుల గోవిందు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. 300 మంది ఉద్యోగులు, 200 మంది వెల్ఫేర్​ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.