- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
వనపర్తి టౌన్, వెలుగు: హైదరాబాద్లోని సరూరు నగర్ స్టేడియం గ్రౌండ్ లో ఈ నెల 23న నిర్వహించ తలపెట్టిన మాలల రణభేరి మహాసభను సక్సెస్ చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుల వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం వనపర్తిలో జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ భవనంలో రణభేరి మహాసభ కరపత్రాలను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడం సరైంది కాదన్నారు.
ఎలాంటి ఎంపరికల్ డేటా తీసుకోకుండా సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ పాయింట్ల కేటాయింపులోనూ మాలలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
16వ రోస్టర్ పాయింట్ కు బదులుగా 22వ రోస్టర్ పాయింట్ కేటాయించడంతో విద్య, ఉద్యోగావకాశాల్లో అన్యాయం జరిగిందని చెప్పారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మొలకలపల్లి మద్దిలేటి, జై భీమ్ స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు బండారు శ్రీనివాసులు, కంటే నిరంజనయ్య, బూరుగుల నాగరాజు. బర్కం రమేశ్, లెంకపల్లి శివ, శాంతన్న పాల్గొన్నారు.
