మాకు అన్యాయం జరిగితే ఉద్యమాలు తప్పవు..కులాన్ని అడ్డం పెట్టుకుని మాలలతో ఆడుకుంటున్నరు: జి.చెన్నయ్య

మాకు అన్యాయం జరిగితే  ఉద్యమాలు తప్పవు..కులాన్ని అడ్డం పెట్టుకుని మాలలతో ఆడుకుంటున్నరు: జి.చెన్నయ్య
  • రాజకీయంగా ఎదగకుండా పాలకులు కుట్ర చేస్తున్నరు
  • అసెంబ్లీలో మా గురించి మాట్లాడింది మంత్రి వివేక్ ఒక్కరే
  • ఏ ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోలేదని చెన్నయ్య వెల్లడి
  • సరూర్ నగర్​లో మాలమహానాడు రణభేరి మహాసభ 

ఎల్బీనగర్, వెలుగు:
కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు క్యాస్ట్​ను అడ్డం పెట్టుకుని వర్గీకరణ పేరుతో మాలలతో ఆడుకుంటున్నాయని, తమకు అన్యాయం జరిగితే ఉద్యమాలు తప్పవని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హెచ్చరించారు. 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తొత్తుగా మారి మాలల కులస్తులను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వర్గీకరణ అంటూనే.. మాలలకు ఇచ్చే రిజర్వేషన్లల్లో రోస్టర్ విధానంతో అణగదొక్కాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. 

హైదరాబాద్ ఎల్బీనగర్ లోని సరూర్ నగర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మాలమహానాడు రణభేరికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘తెలంగాణ అసెంబ్లీలో మాలల గురించి మాట్లాడింది కేవలం మంత్రి వివేక్ వెంకటస్వామి మాత్రమే. మా గురించి ఏ ఎమ్మెల్యే మాట్లాడలేదు. వివేక్​కు ధన్యవాదాలు తెలియజేస్తున్నం. రిజర్వేషన్లతో ఉద్యోగాలు సాధించిన మాలలు సైతం నోరు విప్పడం లేదు. ఎస్సీ వర్గీకరణ చేస్తే.. 5 శాతం రిజర్వేషన్ ఉన్న మాకు జాబ్​లు ఎందుకు వస్తలేవు? హైకోర్టులో కేసు వేశాం. 

ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం. మాలలంతా ఐక్యంగా ఉంటూ రోస్టర్ పాయింట్లను సవరించుకోవాలి. సుప్రీం కోర్టు సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన ఎంపరికల్ డేటా లేకుండా కులాల వారీగా చేసిన ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి’’అని ఆయన డిమాండ్ చేశారు. 

20 ఏండ్లుగా పోరాడుతున్నం: బూర్గుల వెంకటేశం

ఎస్సీ వర్గీకరణ కోసం 2011 లెక్కలు తీసుకొని మాలలకు అన్యాయం చేశారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశం అన్నారు. ‘‘ఎస్సీ వర్గీకరణతో మాలలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అన్యాయం జరుగుతున్నది. 20 ఏండ్లుగా సుప్రీం కోర్టులో పోరాటం చేస్తున్నాం. 

సుప్రీం కోర్టు కాపీలు చదవకుండా ఇక్కడున్న సీఎం వర్గీకరణ చేశారు’’అని వెంకటేశం అన్నారు. నవంబర్ 26న ఇందిరా పార్క్ వద్ద ఒక రోజు దీక్ష చేస్తామని తెలిపారు. జనవరి 26 వరకు డెడ్ లైన్ పెడుతున్నామని, ఆ తర్వాత రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని తెలిపారు. 

రాజ్యాంగం అంటే మంద కృష్ణ మాదిగకు తెలియదని, 30 ఏండ్లుగా ఆయన మాదిగలను మోసం చేస్తున్నారని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు మల్లీశ్వరి మండిపడ్డారు. సభకు మాలమహానాడు లీడర్లు రంజిత్ కుమార్, జై కుమార్, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.