బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నది: చెన్నయ్య

బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నది: చెన్నయ్య

హైదరాబాద్, వెలుగు : బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపించారు. ఓట్ల కోసం దేశంలోని దళితులు, గిరిజనుల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ.. వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జాతీయ ఎస్సీ కమిషన్, సుప్రీంకోర్టులపై ఒత్తిడి తెచ్చి దేశంలోని 1260 కులాలను విభజించి పాలించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.

క్రిమిలేయర్ పేరుతో కొన్ని ఎస్సీ కులాలను రాష్ట్రపతి జాబితా నుంచి తొలగించాలని చూస్తున్నారని తెలిపారు. గిరిజలను కూడా విభజించి పాలించాలని కుట్ర చేస్తున్నారన్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీలను కలపడం, తొలగించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పాలని కోరారు. అలాగే.. తాము ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు.ఎస్సీ వర్గీకరణతో  దళితులు, ఆదివాసీలు

గిరిజనులు మళ్లీ  పూర్వ స్థితికి వెళ్లే ప్రమాదముందన్నారు. బీజీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్, కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్ లో  పోటీ చేస్తామని వివరించారు. రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ అధికారంపై సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చినా రివ్యూ పిటిషన్ వేస్తామని చెన్నయ్య పేర్కొన్నారు.