ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్ లోపాలతో మాలలకు అన్యాయం : మాల స్టూడెంట్ జేఏసీ

ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్ లోపాలతో మాలలకు అన్యాయం : మాల స్టూడెంట్ జేఏసీ

ఓయూ, వెలుగు: ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్ లోని లోపాల తో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ మండిపడ్డారు. మాల స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు మాదాసు రాహుల్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన  తెలిపారు.  ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణలో మాలలకు 22వ రోస్టర్ పాయింట్ కేటాయించడంతో అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇటీవల శాతవాహన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ లో 36 ఉద్యోగులకు ఒకటి కూడా మాలలకు రాకపోవడం దారుణమన్నారు.

డెంటల్ అసిస్టెంట్ సర్జన్(టీవీవీపీ) 42 పోస్టులకు ఒకే పోస్టు కేటాయించగా.. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (ఐఎంఎస్) 6 పోస్టులకు ఒక పోస్ట్ కూడా కేటాయించలేదన్నారు. మాదిగల కన్నా తక్కువ ఉద్యోగాలు ఉన్న మాలలకు రోస్టర్ పాయింట్లు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్నారు. రోస్టర్ పాయింట్ విధానంలో మార్పులు చేసి మాలలకు న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసనలో నామ సైదులు, కొప్పుల అర్జున్, మద్దెల రాజు, సెల్వాది అణేశ్​ వర్మ, బల్లెం ఉదయ్, కరణ్,  నరేశ్, రమేశ్, లింగమూర్తి, హనుమంతు, సతీశ్, దాసరి రవి, శివ  పాల్గొన్నారు.