
జైపూర్ (భీమారం), వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 12,500 జరిమానా విధిస్తూ మంచిర్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ గురువారం తీర్పు ఇచ్చారు. వివరాల మేరకు.. మంచిర్యాల జిల్లా భీమారం మండలానికి చెందిన పద్నాలుగేండ్ల దివ్యాంగ బాలిక కిరాణా షాపు నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. 2022, ఏప్రిల్ 26న అదే గ్రామానికి చెందిన మంగారపు యశ్వంత్ తన ఇంట్లోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు, అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. వాదనల తర్వాత నిందితుడు యశ్వంత్ కు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అదేవిధంగా బాధిత బాలికకు రూ. 7 లక్షల పరిహారం ఇవ్వాలని, డిగ్రీ వరకు ఫ్రీగా చదివించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
కేసులో నిందితుడికి శిక్ష పడేలా వ్యవహరించిన మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, భీమారం ఎస్ఐ శ్వేత, సీడీఓ ధర్మయ్య, లైజన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, గోవిందరావును రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో మరో కేసులో ..
జైనూర్: పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ రమేశ్గురువారం తీర్పు ఇచ్చారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపిన మేరకు.. 2023లో జైనూర్ మండలానికి చెందిన ఎనిమిదేండ్ల బాలికకు మరప రామేశ్వర్ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అనంతరం బాలిక తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ తల్లికి చెప్పింది. బాధితురాలి తల్లి కంప్లయింట్ మేరకు జైనూర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు రామేశ్వర్ ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. డీఎస్పీ చిత్తరంజన్ , జైనూర్ సీఐ రమేశ్, ఎస్ఐ రవికుమార్ ను ఎస్పీ అభినందించారు.