
- మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్
- మంత్రి వివేక్‌ను సన్మానించిన మాలల ఐక్యవేదిక
ముషీరాబాద్, వెలుగు: వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం సంతోషకరమని, ఇది మాలలు పోరాడి సాధించుకున్న విజయమని రాష్ట్ర మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు బేర బాలకిషన్ (బాలన్న) అన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని బుధవారం ఆయన నివాసంలో బేర బాలకిషన్ నేతృతంలో మాల సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బేర బాలకిషన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన మాల ఉపకులాల అభ్యున్నతి కోసం మాల కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిగా వివేక్ ప్రమాణస్వీకారం చేయడంతో లక్షలాదిమంది మాలలు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎంపీగా పోరాటం చేసిన వివేక్ కు మంత్రి పదవి ఇచ్చిన సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మాల సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాల సంఘాలు, ఉప సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.