
తెలంగాణ: బీఎస్పీకి కాంగ్రెస్కు మధ్య వైరుధ్యం లేదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిని అయినప్పటికీ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగానే... బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్తో భేటీ అయ్యానని ఆయన చెప్పారు. దళిత సమస్యలతో పాటు బడుగు, బలహీన వర్గాల సమస్యలు, వారి అభివృద్ధిపై తాము చర్చించామని దయాకర్ తెలిపారు. దళిత ఎజెండా ఎవరు తీసుకున్నా.. మాలమహానాడు మద్దతు ఇస్తుందని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. దళితబంధును కూడా తాము స్వాగతించామని ఆయన అన్నారు. ప్రవీణ్ కుమార్ భవిష్యత్తు రాజకీయాల్లో రాణించాలని కోరుతున్నానని ఆయన అన్నారు. భవిష్యత్తులో ప్రవీణ్ కుమార్తో కలిసి పనిచేసే అవకాశాలున్నాయని దయాకర్ అన్నారు.
రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాల అసైన్డ్ భూమిని కేసీఆర్ ప్రభుత్వం లాక్కుందని, దానిపై పోరాటం చేస్తామని బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎస్సీ కులాల మధ్య వచ్చిన ఇబ్బందులను తొలగించేందుకు ఏం చేయాలో దయాకర్తో చర్చించానని ఆయన తెలిపారు. నెల రోజులుగా కలువాలనుకుంటంటే ఈ రోజు కుదిరిందని ప్రవీణ్ అన్నారు. దళితుల అభివృద్ధితోపాటు ప్రైవేట్ సెక్టార్లో దళితులకు రిజర్వేషన్ అంశాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ అన్నారు.
ఈ రోజు జాతీయ మాల మహానాడు అద్యక్షులు, తెలంగాణ ఉద్యమనేత, మేధావి, శ్రీ అద్దంకి దయాకరన్నను కలిశాను. వారు దేశంలో బహుజన వర్గాల ఐక్యత కోసం, అణచివేయబడ్డవర్గాల హక్కుల కోసం చేస్తున్న పోరాటం ఎంతో స్పూర్తిదాయకమైనది. బహుజన రాజ్య స్థాపనలో దయాకరన్నలాంటి మేధావుల మార్గనిర్దేశం ఒక చారిత్రక అవసరం. pic.twitter.com/gP0ADLXNR4
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) September 9, 2021