మలక్ పేట, వెలుగు: ఓ కుటుంబం విహారయాత్రకు వెళ్లి వచ్చేసరికి వారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మలక్ పేట ప్రొఫెసర్స్ కాలనీలోని మానస అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ 102లో మంత్రవాది వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు.
నవంబర్ 13న కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర కోసం తమిళనాడు, కేరళ, గోవాకు వెళ్లారు. తిరిగి ఈ నెల 10న బుధవారం రాత్రి ఇంటికి వచ్చారు. ఇంట్లోకి వెళ్లగా వెనుక వైపు బాల్కనీ తలుపులు పగలగొట్టి కనిపించాయి. ఆందోళనకు గురైన బాధితుడు గదిలోని బీరువా వద్దకు వెళ్లి చూడగా అది కూడా పగులగొట్టి ఉంది. అందులో ఉన్న రూ.45 లక్షలు, 15 తులాల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి చోరీకి గురైంది.
మలక్ పేట పోలీసులు ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీమ్స్ బృందాలను రప్పించి ఆధారాలు సేకరించారు. మలక్‌పేట ఏసీపీ సుబ్బరామిరెడ్డి, ఇన్ స్పెక్టర్ పిడమర్తి నరేశ్, డిఐ జయశంకర్ చోరీ స్థలాన్ని పరిశీలించారు.
నేపాల్‌కు చెందిన వాచ్మెన్పై అనుమానం..
అపార్ట్మెంట్లో నేపాల్ కు చెందిన అర్జున్ అనే వ్యక్తి కొంతకాలంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఉన్నట్టుండి చెప్పా పెట్టకుండా ఉద్యోగాన్ని మానేసి వెళ్లిపోవడంతో అతడే ఈ చోరీకి పాల్పడి ఉంటాడని బాధితుడు వెంకటరమణ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

