
మలయాళ దర్శకుడు సిద్ధిఖీ (63) కన్ను మూశారు. సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. లివర్ సమస్యతో పాటు నిమోనియాతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. మోహన్ లాల్‌కు మంచి స్నేహితుడైన సిద్ధిఖీ.. దర్శకుడే కాక స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ కూడా. మోహన్ లాల్ సినిమా ‘రాంజీ రావు స్పీకింగ్’తో దర్శకుడిగా పరిచయం అయ్యారు.
తర్వాత వీరిద్దరి కాంబోలో పలు సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. సిద్ధిఖీ దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘బిగ్ బ్రదర్’లోనూ మోహన్ లాల్ హీరో కావడం విశేషం. చిరంజీవి నటించిన ‘హిట్లర్’ ఒరిజినల్ వెర్షన్‌ని మలయాళంలో తీసింది ఈయనే. అలాగే ఆయన డైరెక్షన్‌లో దిలీప్, నయనతార జంటగా నటించిన మలయాళ చిత్రం ‘బాడీ గార్డ్’ ఇతర భాషల్లోనూ రీమేకైంది. తమిళంలో విజయ్‌తో, హిందీలో సల్మాన్‌తో రీమేక్ చేశారు సిద్ధిఖీ. తెలుగులో నితిన్, మీరా చోప్రా జంటగా వచ్చిన ‘మారో’ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు.