ఎల్బీనగర్, వెలుగు: రాంగ్ రూట్ డ్రైవింగ్, నో పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు నిలిపే వారిపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మల్కాజిగిరి సీపీ సుమతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 2,727 కేసులు నమోదు చేసి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.5.50 లక్షల జరిమానా విధించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ, ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చేలా రాంగ్ రూట్లో ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తమ వాహనాలను కేటాయించిన ప్రదేశాల్లోనే పార్క్ చేయాలని, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
