ఐటీ రైడ్స్ లో రూ.4 కోట్లు దొరకడం పెద్ద మ్యాటర్ కాదు: మర్రి రాజశేఖర్ రెడ్డి

ఐటీ రైడ్స్ లో రూ.4 కోట్లు దొరకడం పెద్ద మ్యాటర్ కాదు: మర్రి రాజశేఖర్ రెడ్డి

ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే తమపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవేనని అన్నారు.  తమ ఇళ్లు,  ఆఫీసులు, విద్యా సంస్థలపై ఐటీ దాడులను ఆయన ఖండించారు. ఐటీ సోదాల్లో నాలుగు కోట్లు దొరకడం పెద్ద విషయం కాదన్నారు. తన ఆధ్వర్యంలో 5  విద్యాసంస్థలు నడుస్తున్నాయని చెప్పారు. ఒక్కో విద్యాసంస్థలో సిబ్బందికి ఇచ్చే వేతనాల ఖర్చే రూ.2 కోట్లు ఉంటుందన్నారు.  ఐదు విద్యాసంస్థల్లో ప్రతి నెలా రూ.10 కోట్లు జీతాలే చెల్లిస్తామని చెప్పారు. అలాంటిది 4 కోట్లు దొరకడం పెద్ద విషయం కాదన్నారు. తనది సాధారణమైన ఇల్లని, తన ఇంట్లో డిజిటల్ లాకర్లు ఎందుకు ఉంటాయని  ప్రశ్నించారు.

తమ కుటుంబం పార్టీ మారాలనే ఈ దాడులు చేస్తున్నారని మర్రి రాజశేఖర్ రెడ్డి  అన్నారు.  సోదాల సందర్భంగా ఐటీ అధికారులు తమ కుటుంబ సభ్యుల పట్ట అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. 75 ఏళ్లు పైబడిన తన తండ్రిని పగలూ రాత్రీ అనే తేడాలేకుండా ఇంటికి బయటకూ తిప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కూతురి పట్ల అధికారులు ప్రవర్తించిన తీరు చూసి తనకు బాధగా ఉందన్నారు. తన కూతురు,తండ్రి పట్ల ఐటీ అధికారుల తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

ఐటీ అధికారులు సోదాలకు వచ్చినపుడు తాను టర్కీలో ఉన్నానని మర్రి రాజశేఖర్ రెడ్డి  అన్నారు.  తన కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.  ఐటీ దాడుల విషయం తనకెవరూ చెప్పలేదని.. మీడియాలో చూసే తెలుసుకున్నానని  అన్నారు.