
- మొన్న బోనాల పండగకు బండి సంజయ్ తో కలిసి హాజరు
- స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన అభిమానులు
- నిన్న బండి సంజయ్ తో ప్రీతిరెడ్డి భేటీ!
- తమ ఫ్యామిలీ నుంచి ముగ్గురం పాలిటిక్స్ లో ఉంటామని గతంలోనే చెప్పిన మల్లారెడ్డి
- ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీతిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగతున్నారు. ఆదివారం పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో బండి సంజయ్, ప్రీతిరెడ్డి ఫొటోలు కలిపి ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. వీళ్లిద్దరికీ గ్రాండ్ వెల్కం చెబుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి.
పాతబస్తీలో ఆదివారం (జులై 20) జరిగిన బోనాల వేడుకల్లో బీజేపీ కీలక నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. బండి సంజయ్ కోసం ప్రీతి దాదాపు 5 గంటల పాటు వెయిట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో మరుసటి రోజైన సోమవారం హైదరాబాద్ లోని మేకలమండి బీజేపీ నేత ఇంట్లో నిర్వహించిన లంచ్ కు బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ హాజరయ్యారు.
ఇదే కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా వచ్చారు. వీరిద్దరూ ఒకే టేబుల్ మీద భోజనానికి కూర్చున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తమతో పాటు కూర్చున్న వ్యక్తులను ప్రీతి రెడ్డికి పరిచయం చేయగా.. ఆమె మర్యాదపూర్వకంగా వారికి నమస్కారం చేశారు. ఆతర్వాత ప్రీతిరెడ్డి, బండి సంజయ్‌లు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సన్నివేశాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.
మల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి మూడో లీడర్
మాజీ మంత్రి మల్లారెడ్డి గతంలో పలుమార్లు తమ కుటుంబం నుంచి ముగ్గురు రాజకీయాల్లో ఉంటారని కుండ బద్దలు కొట్టారు. ఒకరు మల్లారెడ్డి అయితే మరో నేత మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి . మూడో నేతగా ప్రీతిరెడ్డి ఎదుగుతారని 2023 ఎన్నికల సమయంలోనే అందరూ భావించారు.
ఆమె ప్రెస్ మీట్స్ పెట్టడం, మల్లారెడ్డి ఎన్నికల కార్యక్రమాలను, ప్రోగ్రామ్స్ మానిటరింగ్ చేయడం, కార్యకర్తలతో మాట్లాడటం ఆసక్తిని పెంచాయి. మల్లారెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ గా ఉన్న ఆమె కాలేజీపై ఐటీ దాడులు జరిగిన సమయంలోనూ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. ఇలా మల్లారెడ్డి ఫ్యామిలీలో ఆమె సుపరిచమైన వ్యక్తి అయ్యారు.
ఆస్పత్రిలో ఉచితంగా కిట్స్
ప్రీతిరెడ్డి స్వస్థలం కర్నాటకలోని హుబ్లి. అమ్మ సైంటిస్ట్, నాన్న డాక్టర్. ఇద్దరూ పుణెలో ఉద్యోగం చేసేవారు. తల్లి వల్ల ప్రీతి రెడ్డి భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. అలానే తల్లిదండ్రుల కోరిక మేరకు డాక్టర్ అయ్యారు. మల్లారెడ్డి ఇంటి కోడలయ్యాక మల్లారెడ్డి గ్రూప్ విద్యాసంస్థల డైరెక్టర్‌గా ఉన్నారు. మల్లారెడ్డి ఆస్పత్రుల్లో ఉచితంగా డెలివరీ చేసి, కిట్ అందిస్తున్నారు.
ఆడపిల్లను కన్న తల్లికి ప్రోత్సాహకం ఇస్తున్నారు. అలానే డెంటల్ హాస్పిటల్‌లో రోజుకు 250 మందికి ఉచిత వైద్యంతోపాటు 750 బెడ్‌లున్న టీచింగ్ ఆస్పత్రుల్లో కూడా ఫ్రీగా వైద్యం చేస్తారు. ఈ నిర్ణయాల వెనక ప్రీతి రెడ్డి ఉన్నారు. ఆమె దీర్ఘకాలిక లక్ష్యంతోనే కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా మల్లారెడ్డి ఇంట్లోంచి మూడో లీడర్ గా ప్రీతిరెడ్డి బయటికి రాబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.