ఇంకెప్పుడు ఇస్తారు పరిహారం...రాజీవ్ రహదారిపై మల్లన్న సాగర్ నిర్వాసితుల ధర్నా

ఇంకెప్పుడు ఇస్తారు పరిహారం...రాజీవ్ రహదారిపై మల్లన్న సాగర్ నిర్వాసితుల ధర్నా

 ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఎన్నో ఊర్లను, లక్ష ఎకరాలను సేకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితులను మాత్రం పట్టించుకోవడం లేదు.  కాళేశ్వరం నుంచి పాలమూరు ప్రాజెక్టు వరకు ఇండ్లు, స్థలాలు  కోల్పోయిన వాళ్లకు ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి పరిహారం అందివ్వలేదు.  దీంతో నిర్వాసితులు రాష్ట్ర  సర్కారుపై మర్లవడుతున్నారు.  న్యాయమైన పరిహారం కోసం కొందరు కోర్టులకు వెళ్తుంటే.. మరికొందరు ధర్నాలు చేస్తున్నారు.  ఆర్ ​అండ్ ​ఆర్ ​ప్యాకేజీ కింద తమకు రావాల్సిన పరిహారం  ఇవ్వాలని కోరుతున్నారు.  తాజాగా సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో నిర్మించిన మల్లన్న సాగర్ నిర్వాసితులు పరిహారం కోసం రోడ్డెక్కారు. సిద్దిపేట జిల్లా రాజీవ్ రహదారిపై భైఠాయించారు.  గౌరారం, సింగరాయి పల్లి మధ్యలోని హైవేపై ధర్నా నిర్వహించారు. దీంతో  ఆ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 

తల్లిలాంటి పల్లెలను ప్రాజెక్టులకు కోసం ధారపోస్తే..ప్రస్తుతం తాము దిక్కులేని పక్షులమయ్యామని మల్లన్నసాగర్ నిర్వాసితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ సదుపాయాలు కల్పిస్తాం..ఈ సదుపాయలు అందిస్తామని..మాయమాటలు చెప్పి భూములు లాక్కున్నారని..ఇప్పుడు కనీసం చట్టప్రకారం ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. మల్లన్న సాగర్ నిర్మించి ఏండ్లు గడుస్తున్నా..తమకు పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.  

మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల్లో 9 గ్రామాల నుంచి దాదాపు 13 వేల పట్టా భూములను ప్రభుత్వం సేకరించింది. ఈ ఊర్లలో ఎకరా రూ. 20 లక్షలకు పైగా పలుకుతోంది.  కానీ ప్రభుత్వం మాత్రం రూ. 6 లక్షలకు మించి పరిహారం ఇవ్వలేదు. వెయ్యి మందికి పైగా నిర్వాసితులు కోర్టుల్లో పోరాడుతున్నారు. చాలా మందికి ఇప్పటికీ పరిహారం అందలేదు.