మల్లారెడ్డిపై ఐటీ దాడులు..ల్యాప్ టాప్ మాయం చేసిందెవరు?

మల్లారెడ్డిపై ఐటీ దాడులు..ల్యాప్ టాప్  మాయం చేసిందెవరు?

ఐటీ సోదాల్లో మిస్సైన ల్యాప్ టాప్ ఇష్యూ కీలకంగా మారుతోంది. ఆ ల్యాప్ టాప్ ఐటీ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ కు చెందినదిగా గుర్తించారు. అర్ధరాత్రి సోదాల సమయంలో ఐటీ ఆఫీసర్ రత్నాకర్ దగ్గర నుంచి మల్లారెడ్డి అనుచరులు ల్యాప్ టాప్ లాక్కెళ్లారు. ఇదే విషయంపై బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఐటీ అధికారి రత్నాకర్.. మంత్రి మల్లారెడ్డిపై కంప్లైంట్ చేశారు. పీఎస్ లో ఫిర్యాదు చేశాక... కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ల్యాప్ టాప్ ను గేటు దగ్గర పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఇద్దర్ని ఐటీ ఆఫీసర్లు, సీఆర్పీఎఫ్ అధికారులు ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న ల్యాప్ టాప్ తీసుకెళ్లాలని ఐటీ అధికారులను పోలీసులు కోరారు. అయితే తన ల్యాప్ టాప్ లో ఐటీ దాడులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం డిటైల్స్ ఉన్నాయని ఐటీ అధికారి రత్నాకర్ అంటున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న ల్యాప్ టాప్ తనది కాదని చెబుతున్నారు. దీంతో ఆ ల్యాప్ టాప్ ను FSLకు పంపాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే అధికారులు ల్యాప్ టాప్ మర్చిపోతే.. తామే పోలీస్ స్టేషన్ లో ఇచ్చి వచ్చామని చెబుతున్నారు మంత్రి మల్లారెడ్డి. 

పరస్పర ఫిర్యాదులు

రాత్రి నడిచిన హైడ్రామాలో ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి కేసులు పెడితే.. ఐటీ అధికారులు కూడా మంత్రి మల్లారెడ్డిపై కేసులు పెట్టారు. బోయిన్ పల్లి పీఎస్ లో నమోదైన ఈ కేసులను దుండిగల్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. డ్యూటీకి ఆటంకం కలిగించారని ఐటీ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వస్తువులను బలవంతంగా లాక్కెళ్లారని కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద మల్లారెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు . తమపై దౌర్జన్యం చేశారని మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో ఐటీ అధికారి రత్నాకర్ పై 384 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు