
హైదరాబాద్, వెలుగు : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్‌ఎస్ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ వద్దని, తాము ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తేల్చి చెప్పారు. కొడుకు భద్రారెడ్డిని తీసుకుని శుక్రవారం నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి ఆయన వెళ్లారు. అక్కడే కేటీఆర్‌తో వారిద్దరు భేటీ అయ్యారు.
.చెరువు శిఖం భూమిలో కట్టిన తన అల్లుడి కాలేజీ భవనాల కూల్చివేత అంశాన్ని కేటీఆర్‌కు వివరించారు. ఆ కాలేజీల వ్యవహారంలోనే సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారు వేంనరేందర్ రెడ్డిని కలిశామని, పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు, తమకు పరిస్థితులు అనుకూలంగా లేనందున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మల్కాజ్‌గిరి టికెట్ ఎవరికి ఇచ్చినా, వారి గెలుపు కోసం పనిచేస్తామన్నారు. భద్రారెడ్డికి టికెట్ ఇవ్వాలని ఇన్నాళ్లు మల్లారెడ్డి కోరుతూ వచ్చారు. ఆయనకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటానని పలుమార్లు ప్రకటించారు. అయితే, బీఆర్‌ఎస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండడంతోనే పోటీకి వెనుకంజ వేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.