విపక్ష నేతగా ఖర్గేకు చాన్స్.. సీనియర్లకు మొండిచెయ్యి

విపక్ష నేతగా ఖర్గేకు చాన్స్.. సీనియర్లకు మొండిచెయ్యి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ వెటరన్ నేత గులాం నబీ ఆజాద్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో రాజ్యసభలో విపక్ష నేత (లీడర్ ఆఫ్ అపోజిషన్) స్థానం ఖాళీ అయ్యింది. ఆజాద్ తర్వాత డిప్యూటీ లీడర్‌గా వున్న మరో సీనియర్ నేత ఆనంద శర్మ ఈ పదవికి నియమితులవుతారని అంతా భావించారు. అయితే ఈ ప్లేస్‌‌ను మరో సీనియర్ లీడర్‌ మల్లికార్జున ఖర్గేతో భర్తీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఖర్గేను విపక్ష నేతగా పేరును ప్రతిపాదిస్తూ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు కాంగ్రెస్ లేఖ రాసింది. ఈ నెల 15తో ఆజాద్ పదవీ కాలం ముగుస్తుంది. ఆ తర్వాత నుంచి ఖర్గే విపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఆజాద్ పదవీ విరమణ విషయం తెరమీదికి వచ్చినప్పట్నించి సీనియర్‌‌లు అయిన దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, చిదంబరం, కపిల్ సిబాల్ వంటి నాయకుల పేర్లు విపక్ష నేత స్థానం రేసులో వినిపించాయి. ఆనంద్ శర్మకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఖర్గేకు ఆ పదవి దక్కడం గమనార్హం.