తెలంగాణను కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుంది :  మల్లికార్జున ఖర్గే ఫైర్

తెలంగాణను కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుంది :  మల్లికార్జున ఖర్గే ఫైర్

శివ్వంపేట, వెలుగు: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి అందరినీ రాహుల్ గాంధీ కలిశారని, వారి కష్టసుఖాలు తెలుసుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కానీ ఫామ్ హౌస్‌కు పరిమితమయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్.. లిక్కర్, మైనింగ్ మాఫియాలను మాత్రమే కలుస్తారని మండిపడ్డారు. సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కలలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు.

కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి, డబుల్ బెడ్రూం ఇండ్లు తదితర ప్రాజెక్టుల్లో లక్షల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తెలంగాణను ఇచ్చిన సోనియమ్మను దూషించిన కేసీఆర్‌‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. తెలంగాణను సోనియా ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారన్న విషయం మరచిపోవద్దన్నారు. రైతుబంధు పంపిణీ నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం చెబితే.. కాంగ్రెస్ పార్టీనే ఆపినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నేతలు సుహాసిని రెడ్డి, శేష సాయి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.