
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం జరగనున్న సమావేశానికి కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ) అందరూ తరలిరావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని చెప్పారు. సమావేశ ఏర్పాట్లపై సీఎం మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సమీక్ష చేశారు. కాంగ్రెస్ బీఎల్ఏల మీటింగ్‌కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేAశ్ కుమార్‌గౌడ్ కు సీఎం రేవంత్పలు సూచనలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల గెలుపులో బీఎల్ఏలు కీలకపాత్ర పోషించారని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాంటి పనితీరును కనబరిచేందుకు ఖర్గే దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. హామీల అమలు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై బీఎల్ఏలకు ఖర్గే సూచనలు చేయనున్నట్టు తెలుస్తున్నది. కాగా, రాష్ట్రంలో 43 వేల మంది కాంగ్రెస్ బీఎల్ఏలున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వారందరూ సమావేశానికి హాజరయ్యేలా ఇప్పటికే ఆర్డర్స్ వెళ్లినట్టు తెలుస్తున్నది.