మార్కెట్లు కళకళ.. షాపులు కిటకిట

మార్కెట్లు కళకళ.. షాపులు కిటకిట

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా లాక్‌‌డౌన్‌‌తో ఇన్నిరోజులు మూగబోయిన ఊర్లు, పట్టణాలు, నగరాలు.. ప్రభుత్వం పూర్తిగా అన్‌‌లాక్‌‌ ప్రకటించడంతో హడావుడిగా కనిపిస్తున్నాయి. మాల్స్‌‌, మార్కెట్లు, షాపులు, గుళ్లు, హోటళ్లు అన్నీ ఆదివారం తెరుచుకున్నాయి. సిటీలో మాల్స్‌‌ కిటకిటలాడాయి. రెస్టారెంట్లకు గిరాకీ దొరికింది. పార్కులు జనంతో, బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. లాక్‌‌డౌన్‌‌కు ముందులా జనజీవనం సాధారణమైపోయింది. 

గిరాకీలు మొదలైనయ్‌‌

లాక్‌‌డౌన్‌‌తో రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునేవాళ్లు ఆర్థికంగా చితికిపోయారు. కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారాలు ఆపేశారు. దీంతో రోజువారి ఆదాయంతోనే బతికే ఆ వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే ప్రస్తుతం సిటీ మాములు స్థితికి రావడంతో గిరాకీ మొదలైందని చిరు వ్యాపారులు చెబుతున్నారు. అన్‌‌లాక్‌‌ చేయడం, పైగా ఆదివారం కావడంతో హోటళ్లు, రెస్టారెంట్లు కూడా కస్టమర్లతో కిటకిటలాడాయి. కిచెన్‌‌లో, టేబుల్స్‌‌ దగ్గర జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. లాక్‌‌డౌన్ వల్ల చాలా పెళ్లిళ్లు, ఫంక్షన్లు వాయిదా పడ్డాయి. అవన్నీ ఇప్పుడు రీ షెడ్యూల్ అవుతున్నాయి. ఈ నెల చివరి వరకు మంచి ముహుర్తాలు ఉండటం తో జనాలు బట్టలు, బంగారం కొనేందుకు వెళ్తున్నారు. ఆదివారం సిటీలోని బంగారం, బట్టల షాపులు కస్టమర్లతో రద్దీగా కనిపించాయి. సిటీలోని టూరిస్టు స్పాట్‌‌లు కూడా పర్యాటకులతో కనిపించాయి.

మెట్రో టైమ్‌‌ పెంపు.. అదనపు బస్సులు

లాక్‌‌డౌన్ ఎత్తేయడంతో మెట్రో సర్వీస్‌‌ల సమయాన్ని పెంచారు. పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా మునుపటితో పోలిస్తే రద్దీ కనిపించింది. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో అదనంగా 350 బస్సులను రోడ్డెక్కించేందుకు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. షేర్ ఆటోలకూ గిరాకీ పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద, చిన్న దేవాలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. యాదాద్రి, వేములవాడ, భద్రాచలం, కొమురవెల్లి సహా పలు దేవాలయాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాదాద్రిలో 8 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

ఇగ వ్యాపారం బాగైతదనుకుంటున్న

మాది బేగంబజార్. నేను రోడ్ సైడ్ కళ్లద్దాలు, చార్జర్లు, హెడ్ ఫోన్లు తోపుడు బండి మీద పెట్టుకుని అమ్ముతుంట. కరోనాకు ముందు వ్యాపారం బాగుండే. లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో చాలా కష్టపడ్డం. ఆదివారం నుంచి మాములుగా ఉంటుదని అంటున్నరు. వ్యాపారం బాగా జరుగుతుందని నమ్మకముంది. 
- సంతోష్‌‌ (రోడ్ సైడ్ వ్యాపారి)

లాక్‌‌డౌన్‌‌తో ఇబ్బంది పడ్డం

లాక్‌‌డౌన్‌‌తో మాకు చాలా ఇబ్బంది అయింది. 6 నుంచి 10 వరకు ఉన్నప్పుడు పరుగులు పెట్టేవాళ్లం. అన్నం తినే టైమ్‌‌ కూడా లేక దొరికిన దగ్గర రూ. 5 భోజనం చేసే వాళ్లం. ఇంట్లో భార్యాపిల్లలూ బాధపడ్డరు. 2 నుంచి సాయంత్రం 6 చేశాక పర్లేదనిపించింది. ఆదివారం నుంచి మొత్తం లాక్ డౌన్ తీసేశారు. దేవుడి దయవల్ల గిరాకీలు రావాలని కోరుకుంటున్నం.
- సతీశ్‌‌ కుమార్, ఆటో డ్రైవర్ 

అందరూ కరోనా రూల్స్‌‌ పాటించాలె

మాది నల్లకుంట. బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయానికి భార్యతో వచ్చా. టెంపుల్‌‌లో రష్ బాగా ఉంది. సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్‌‌ లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పెద్దగా కనిపించలేదు. మాకు మేమే జాగ్రత్తగా ఉన్నం. కరోనా రూల్స్ పాటించి ఉంటే బాగుండేది.
- వేణు, ఈవెంట్ మేనేజర్, నల్లకుంట