
- అట్ల మాట్లాడితే చర్యలు తప్పవు
- కాంగ్రెస్ నేతలకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి హెచ్చరిక
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎవరు ఫిర్యాదు చేయలేదని వెల్లడి
- కమిటీ ముందు హాజరైన నేతలు నర్సారెడ్డి, హరికృష్ణ
హైదరాబాద్, వెలుగు: పార్టీ అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడొద్దని, మాట్లాడితే చర్యలు తప్పవని కాంగ్రెస్ నేతలకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. ఆదివారం గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ జరిగింది. పలువురు నేతలపై పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల మీద ఈ సమావేశంలో చర్చించారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై ఆయన కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు.
నర్సారెడ్డిపై గజ్వేల్ దళితులు ఫిర్యాదు చేశారని, ఆయనకు నోటీసు ఇచ్చి వివరణ అడిగామని మల్లు రవి తెలిపారు. నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించామని మీటింగ్ తర్వాత మీడియాకు వెల్లడించారు. సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణపై కూడా ఫిర్యాదు వచ్చిందని, ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు మల్లు రవి తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.
కాగా, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆదేశం మేరకు కమిటి ముందుకు వచ్చానని, తనపై ఆరోపణలకు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారని మీడియాకు నర్సారెడ్డి తెలిపారు. తాను దళితులకు వ్యతిరేకం కాదని, ఇటీవల పార్టీ కార్యక్రమంలో ప్రొటోకాల్ లేకుండా స్టేజీ మీదికి కొంత మంది వస్తుంటే తమ వాళ్లు వద్దన్నారని, అంతే తప్ప తాను దళితులను వ్యతిరేకించలేదని ఆయన అన్నారు.
‘‘నాపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. అదే వ్యక్తి ఎంపీ ఈటల వస్తే పటాకులు కాల్చి స్వాగతం పలికారు. అలాంటి వ్యక్తి ఫిర్యాదు చేస్తే.. నన్ను పిలవడం ఏమిటో అర్థం కావడం లేదు. జనరల్ కోటాలోనూ దళితులకు పదవులు ఇచ్చాను. ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఈటలకు స్వాగతం పలికిన విషయంపై కూడా కమిటీ దృష్టికి తెచ్చాను. దానిపైనా కమిటీ చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్న” అని నర్సారెడ్డి పేర్కొన్నారు.