గజల్స్​​కు కేరాఫ్ తెలంగాణ : మామిడి హరికృష్ణ

గజల్స్​​కు కేరాఫ్ తెలంగాణ : మామిడి హరికృష్ణ

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ
 

ముషీరాబాద్, వెలుగు : దక్షిణాదిన గజల్స్​​కు కేరాఫ్ తెలంగాణ అని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దక్షిణాది భాషల గజల్ సమ్మేళనాన్ని నిర్వహించారు. చీఫ్​గెస్టుగా హాజరైన మామిడి హరికృష్ణ మాట్లాడుతూ..హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన తెలుగు గజల్స్.. దాశరథి, సి. నారాయణరెడ్డి లాంటి కవుల  కృషి ఫలితంగా ఎక్కువ ప్రచారంలోకి వచ్చిందన్నారు. భాగ్యనగరానికి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టిందన్నారు.

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు మాట్లాడుతూ.. ద్రవిడ భాషల్లోకి తెలుగు గజల్స్​ను అనువాదం చేయాలంటే ఇలాంటి మహా సమ్మేళనాలు ఎక్కువగా జరగాలన్నారు. తెలుగు సాహిత్యంలో గజల్స్​​కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. అనంతరం కవులు, అనువాద కళాకారులకు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ జాతీయ గజల్ పురస్కారాలను అందజేశారు. సమ్మేళనంలో మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, డాక్టర్ నాళేశ్వరం శంకరం, ప్రొఫెసర్ దేవన్న, డాక్టర్ మారెళ్ల ప్రసాద్, దక్షిణాది  రాష్ట్రాలకు చెందిన గజల్స్​​ కళాకారులు  పాల్గొన్నారు.