అధికలోడు, పర్మిషన్ లేని వాహనాలు సీజ్ చేస్తం : మామిండ్ల చంద్రశేఖర్

అధికలోడు, పర్మిషన్ లేని వాహనాలు సీజ్ చేస్తం : మామిండ్ల చంద్రశేఖర్
  • రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి
  • వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలి
  • డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ 

హైదరాబాద్,వెలుగు : వాహనదారులకు మరింతగా మెరుగైన సేవలు అందించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ అధికారులకు సూచించారు. అధిక లోడుతో, అనుమతులు లేకుండా వెళ్లే  వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే సీజ్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి యజమానిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు భద్రత పై వచ్చే రోజుల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేయాలని సూచించారు.

శుక్రవారం మణికొండలోని రంగారెడ్డి జిల్లా రవాణాశాఖ ఆఫీసులో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల రవాణాశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. రవాణా శాఖ ఆఫీసుల్లోని హెల్ప్ డెస్క్ లను మరింత పటిష్ట పరచాలని, టీ యాప్ ఫోలియో ద్వారా జరిగే ఆన్ లైన్ సేవలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.  

వాహనదారులు transport. telangana.gov.in  వెబ్ సైట్ లో తమ సమస్యలపై ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కారం చేస్తామని సూచించారు. జిల్లాల వారీగా, ఎంవీఐలు సాధించిన ఆదాయ లక్ష్యాన్ని సమీక్షించారు. ప్రభుత్వ టార్గెట్ ను సాధించాలని ఆదేశించారు. అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రత్యేక తనిఖీలు కొనసాగించాలని సూచించారు. వాహనదారులు త్రైమాసిక పన్నులు చెల్లించాలని లేని పక్షంలో తనిఖీల్లో పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తామని స్పష్టంచేశారు. ఈ  సమావేశంలో రంగారెడ్డి, మేడ్చల్-, వికారాబాద్ జిల్లాల రవాణాశాఖ అధికారులు వెంకటరెడ్డి, రఘునందన్​గౌడ్, వాణి, సుభాశ్​ చంద్రారెడ్డి, కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.