ఢిల్లీలో వెలుగు చూసిన మరో ఘోరం

ఢిల్లీలో వెలుగు చూసిన మరో ఘోరం
  • భర్తను చంపేసి 10 ముక్కలు చేసింది
  • ఢిల్లీలో వెలుగు చూసిన మరో ఘోరం 
  • కొడుకుతో కలిసి హత్య చేసిన మహిళ
  • శ్రద్ధ హత్య కేసు దర్యాప్తు చేస్తుండగా  బయటపడ్డ దారుణం

న్యూఢిల్లీ:  శ్రద్ధా వాకర్ హత్య తరహాలో ఢిల్లీలో మరో దారుణం బయటపడింది. ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను చంపి 10 ముక్కలుగా నరికేసింది. ఇద్దరూ కలిసి బాడీ పార్ట్స్​ను ఫ్రిజ్​లో దాచి నాలుగు రోజుల పాటు సిటీలో వేర్వేరు చోట్ల పడేశారు. తూర్పు ఢిల్లీలోని పాండవ్​నగర్​లో దాదాపు 6 నెలల కింద జరిగిన ఈ ఘోరం సోమవారం నాడు బయటపడింది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు చేస్తున్న దర్యాఫ్తులో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. శ్రద్ధ బాడీ పార్ట్స్​ కోసం సెర్చ్ చేస్తుండగా పోలీసులకు పాండవ్​నగర్​లోని ఓ గ్రౌండ్​లో కుల్లిన స్థితిలో మనిషి తల, చేతులు దొరికాయి. అవి శ్రద్ధవే అనే అనుమానంతో పోలీసులు వాటిని ల్యాబ్ టెస్ట్ కు పంపారు. అవి 40 ఏండ్లకు పైబడిన వ్యక్తివని రిపోర్ట్ రావడంతో ఉన్నతాధికారులు ఓ స్పెషల్ టీమ్​ను ఏర్పాటు చేసి, దర్యాఫ్తు చేయించారు. రివర్స్ మోడ్​లో సీసీటీవీ ఫుటేజీలను వెతికిన పోలీసులు.. ఆ పార్ట్స్​ పడేసిన తల్లీకొడుకులైన పూనమ్, దీపక్​ను గుర్తించి అరెస్ట్ చేశారు. కొడుకు దీపక్​తో కలిసి భర్త అంజన్ దాస్​ను చంపేసినట్లు పూనమ్ ఒప్పుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు. 

నిద్ర మాత్రలు ఇచ్చి గొంతు కోసి.. 

పోలీసుల దర్యాప్తులో నిందితులు పూనమ్(48), దీపక్(25) నుంచి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పాండవ నగర్​లో నివాసం ఉంటున్న వీళ్ల కుటుంబం అంజన్​దాస్​(45) ను చంపడానికి ఈ ఏడాది జనవరి నుంచే ప్లాన్​ చేస్తున్నారు. మే నెలాఖరున నిద్రమాత్రలు కలిపిన మందును అంజన్ దాస్​తో తాగించారు. సోయిలేకుండా పడిపోయాక తల్లీకొడుకులు అంజన్​ను గొంతుకోసి చంపేశారు. రక్తం మొత్తం పోవాలని డెడ్​ బాడీని ఓ రోజంతా అలాగే వదిలేశారు. మరుసటి రోజు బాడీని 10 ముక్కలుగా నరికి ఫ్రిజ్​లో పెట్టారు. అనుమానం రాకుండా వాటిని కల్యాణ్​పురిలోని గ్రౌండ్​తో పాటు పలుచోట్ల పడేశారు. పుర్రెను పాతిపెట్టినట్లు తల్లీకొడుకులు వివరించారు. అంజన్ దాస్ ఇంటి చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా.. రాత్రిపూట దీపక్ ఓ బ్యాగ్ పట్టుకుని వెళ్తుండటం.. అతని వెనకే పూనమ్ వెళ్తుండటం కనిపించింది. ఇప్పటివరకు అంజన్​ దాస్​ కు చెందిన బాడీ పార్ట్స్ ఆరింటిని కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు. 

కూతురు,  కోడలుతో అసభ్యంగా ప్రవర్తించడంతోనే.. 

పద్నాలుగేండ్ల వయసులోనే పూనమ్​కు పెళ్లి జరిగింది. కొంతకాలం తర్వాత పూనమ్​ ను వదిలేసి ఆమె భర్త ఢిల్లీకి వెళ్లిపోయాడు. వెతుక్కుంటూ ఢిల్లీ చేరుకున్న పూనమ్​కు భర్త ఆచూకీ చిక్కలేదు. ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం.. అతడితో సహజీవనం చేసింది. 2016 లో అతడు చనిపోవడంతో 2017లో అంజన్​ దాస్​ ను పెళ్లిచేసుకుంది. బీహార్​కు చెందిన అంజన్ కు అప్పటికే పెళ్లయి ఎనిమిది మంది సంతానం కూడా ఉన్నారు. పెళ్లయ్యాక చాల రోజులకు ఈ విషయం బయటపడడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలయ్యేవని పూనమ్ వెల్లడించింది. తాగుడుకు అలవాటైన అంజన్ తన కొడుకును డబ్బుల కోసం వేధించేవాడని చెప్పింది. ఇంట్లో దాచిన తన నగలను అమ్మేసి, వచ్చిన డబ్బును బీహార్​లో ఉన్న మొదటి పెళ్లానికి పంపించాడని ఆరోపించింది. ఇంట్లో ఉంటున్న తన కూతురు, కోడలు(దీపక్​ భార్య) తోనూ అసభ్యం గా ప్రవర్తించేవాడని తెలిపింది. దీంతో విసిగిపోయి అంజన్​ను చంపేశామని పూనమ్ చెప్పింది.