గండిపేట, వెలుగు: చంటిబిడ్డతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని నార్సింగి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సీఐ హరికృష్ణరెడ్డి వివరాల ప్రకారం.. ఈ నెల 14న మధ్యాహ్నం అల్కాపూర్ టౌన్‌షిప్‌లోని ఓ ప్లే స్కూల్ నుంచి తన రెండున్నరేండ్ల చిన్నారిని తీసుకుని బాధితురాలు నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా, ప్రధాన రహదారిపై ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమెను వెంబడించాడు.
వెనుక వైపు నుంచి ఆమె దుస్తులను పైకి లాగుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితుడిని మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం చకలిపల్లి గ్రామానికి చెందిన నాగరాజు(26)గా గుర్తించారు. ప్రస్తుతం పుప్పాలగూడలో నివాసం ఉంటున్న అతడిని శనివారం అదుపులోకి తీసుకుని విచారించగా, తన తప్పును అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
