చెప్పినట్టు చేయకపోతే ఫొటోలు నెట్ లో పెడతా

చెప్పినట్టు చేయకపోతే ఫొటోలు నెట్ లో పెడతా

మల్కాజిగిరిలో మహిళను వేధిస్తున్న వ్యక్తి అరెస్టు

మల్కాజిగిరి,వెలుగు: ఓ మహిళ ఫొటోలను నెట్ లో పెడతానని వేధిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ మన్మోహన్ యాదవ్ వివరాల ప్రకారం..విష్ణుపురి కాలనీలో ఉండే ఓ మహిళ(31) దోమలగూడలోని భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో 2013 నుంచి పనిచేసేది. అదే కంపెనీలో పనిచేసే రామాంతపూర్ కు చెందిన శ్రీధర్ రావు(38)తో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. శ్రీధర్ ఆ మహిళను ప్రేమించి..పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఓ రోజు ఆ మహిళ శ్రీధర్ రావు సెల్ ఫోన్ చూడగా..అతడు మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలుసుకుంది. దీంతో సదరు మహిళ, శ్రీధర్ రావు మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తనను పెళ్లిచేసుకోమని మహిళ శ్రీధర్ రావును అడగగా..అతను అందుకు ఒప్పుకోలేదు. కానీ కొంతకాలంగా శ్రీధర్ రావు ఆ మహిళకు ఫోన్ చేసి తన రూమ్ కి రావాలని లేకపోతే పర్సనల్ ఫొటోలను ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఆ మహిళ ఈ నెల 11న మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్ చేసింది. శ్రీధర్ రావును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని సీఐ తెలిపారు.