యువతకు గుడ్ న్యూస్ ..ఏటీసీల్లో 6 కొత్త కోర్సులు..

యువతకు గుడ్ న్యూస్ ..ఏటీసీల్లో 6 కొత్త కోర్సులు..

 

  • ప్రారంభించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి
  • మల్టీ స్కిల్స్ ​ఉంటేనే ఉద్యోగావకాశాలు.. యువత ఒకే నైపుణ్యానికి పరిమితం కావొద్దు 
  • కంపెనీలను స్కిల్డ్‌‌ యూత్‌‌ కొరత వేధిస్తున్నది.. విదేశాల్లో ఇండియన్లకు ఎక్కువ డిమాండ్ 
  • ఇక్రిసాట్‌‌తో చర్చించి ఏటీసీల్లో అగ్రిబేస్డ్ కోర్సులు స్టార్ట్ చేస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత పోటీ  ప్రపంచంలో యువతకు ఒక్క నైపుణ్యం సరిపోదని,  మల్టీ స్కిల్స్‌‌ ఉంటేనే అవకాశాలు మరింత పెరుగుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) నుంచి బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణా విధానం ఉండాలని ప్రిన్సిపాల్స్‌‌కు సూచిస్తున్నామని చెప్పారు. సోమవారం మల్లేపల్లి ఐటీఐలోని ఏటీసీలో 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్లాన్‌‌లో భాగంగా 6 షార్ట్ టర్మ్ కోర్సులను మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలు కలిగిన యువత అందుబాటులో లేరని అనేక పరిశ్రమలు చెబుతున్నాయని తెలిపారు. ఇటీవల సీఐఐ మీటింగ్‌‌తోపాటు ఏ సమావేశానికి వెళ్లినా.. ఇదే అంశాన్ని పారిశ్రామికవేత్తలు ప్రస్తావిస్తున్నారన్నారు. అందుకే విద్యార్థులకు ఇండస్ట్రీలకు అవసరమైన స్కిల్స్‌‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఏటీసీలు, ఐటీఐలు భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన శిక్షణ పొందిన నిపుణులను తయారు చేస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం  రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు  మెరుగైన సేవలు అందించేందుకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నదని చెప్పారు. ఈ ప్రణాళికలో తీసుకున్న నిర్ణయాలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు.  

అగ్రి అలైడ్ సెక్టార్‌‌పై ఫోకస్‌‌

గ్రామీణ ప్రాంతాల్లో టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన కోర్సులను త్వరలో ప్రారంభించనున్నట్టు మంత్రి వివేక్‌‌ వెల్లడించారు. ప్రపంచంతో పోలిస్తే వ్యవసాయ రంగంలో మన ఉత్పాదకత తక్కువగా ఉన్నందున అగ్రి అలైడ్ సెక్టార్‌‌లో నైపుణ్యాలను పెంచే కార్యక్రమాలు చేపడతామని  తెలిపారు.  ఐటీఐల నుంచి బయటకు వచ్చే వారికి జాబ్‌‌లు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా సీఎన్‌‌సీ మెషీన్ ఆపరేషన్, రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీ, 2డీ, 3డీ ప్రొడక్ట్ డిజైనింగ్‌‌లాంటి ఆధునిక కోర్సులను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల జీనోమ్ వ్యాలీలో సైతం కంపెనీలతో చర్చించామని, అక్కడ  ఏటీసీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామన్నారు.

  “2047 విజన్ డాక్యుమెంట్‌‌ అమలును ప్రభుత్వం టార్గెట్‌‌గా పెట్టుకున్నది.  3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. విదేశాల్లో భారతీయ ఉద్యోగులకు ఎక్కువ డిమాండ్ ఉంది. నిరుద్యోగులను టామ్ కామ్ ద్వారా విదేశాలకు పంపిస్తున్నాం. ఆయా దేశాల భాష, ఇతర స్కిల్స్ నేర్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చేవారు స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి . జిల్లాలో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు జీవితంలో విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యం.  కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. నైపుణ్యాలను పెంపొందించుకోవాలి.  విదేశాల్లో మెరుగైన వేతనాలతో మంచి అవకాశాలు ఉన్నాయి” అని తెలిపారు. ఏటీసీల నుంచి ఇప్పటికే పలువురు విద్యార్థులు ఉద్యోగాల్లో చేరుతున్నారని, భవిష్యత్తులో జిల్లాలవారీగా జాబ్ మేళాలు నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం విజయ్ నగర్ కాలనీ ఏటీసీ కేంద్రాన్ని సందర్శించి.. అక్కడ రోబోను పరిశీలించారు.  టామ్ కామ్ ద్వారా జాబ్‌‌లు పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. సీఎస్సార్‌‌‌‌లో భాగంగా మాక్రో మీడియా డిజిటల్ ఇమేజింగ్ కంపెనీ నిర్మించిన ఎలక్ట్రికల్ డీజిల్ మెకానికల్ ల్యాబ్‌‌ను  ప్రారంభించారు.

అడ్మిషన్లు భారీగా  పెరిగినయ్‌‌: దాన కిశోర్

గతంలో ఐటీఐల్లో 2 వేలలోపు అడ్మిషన్లు అయ్యేవని.. ఏటీసీలు స్టార్ట్ చేశాక 30 వేల అడ్మిషన్లు అయ్యాయని కార్మిక శాఖ స్పెషల్ సీఎస్ దానకిశోర్ తెలిపారు. వివిధ కోర్సులు పూర్తి చేసి బయటకు వస్తున్న నిరుద్యోగులకు జాబ్స్ అందడం లేదన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో 30 కేంద్రాల ద్వారా 5 వేల మందికి ట్రైనింగ్, జాబ్ కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.   99 రోజుల యాక్షన్ ప్లాన్‌‌లో భాగంగా ట్రైనింగ్ పోగ్రాంలు నిర్వహిస్తున్నామని, ప్లేస్‌‌మెంట్స్ ఇచ్చేలా ఈ ట్రైనింగ్ ఉంటుందని ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ అన్నారు. 6  కోర్సుల్లో బ్యాచ్‌‌కు 20 మంది చొప్పున 120 మందికి  13 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. టామ్ కామ్ ద్వారా నర్సులకు ట్రైనింగ్ ఇచ్చి ఆయా దేశాల భాషలు నేర్పి విదేశాల్లో ఎక్కువ వేతనంతో ప్లేస్‌‌మెంట్స్ కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నగేశ్‌‌, నర్సయ్య, రాజా, ప్రిన్సిపాల్ శైలజతోపాటు  ట్రైనర్లు పాల్గొన్నారు.