- ఐఐటీ మద్రాస్‌తో ఉన్నత విద్యామండలి కీలక ఒప్పందం
- డిజిటల్ విద్యను బలోపేతం చేసేందుకు కసరత్తు
- అధ్యాపకులకు శిక్షణ.. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు
- యూనివర్సిటీల వెబ్‌సైట్లలో అందుబాటులోకి కోర్సుల లింకులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ) మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వయం ప్లస్ ఇనీషియేటివ్‌ను రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యంతో విద్యార్థులకు, లెక్చరర్లకు ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆన్‌లైన్ విద్యా వనరులు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డికి ఐఐటీ మద్రాస్ ప్రతినిధుల మధ్య ఎంఓయూ జరిగింది.
కోర్సు చేస్తే క్రెడిట్లు
ఈ ఒప్పందం ప్రకారం సైన్స్, టెక్నాలజీ, హ్యుమానిటీస్, కామర్స్ వంటి వివిధ విభాగాల్లో ఐఐటీ మద్రాస్ అందించే స్వయం ప్లస్ ఆన్‌లైన్ కోర్సులను రాష్ట్రంలోని యూనివర్సిటీల కరికులమ్ కు అనుసంధానం చేస్తారు. ఈ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు వారి అకడమిక్ రికార్డుల్లో క్రెడిట్లు ఇవ్వనున్నారు. దీంతో విద్యార్థులకు అదనపు నైపుణ్యాలతో పాటు అకడమిక్ ప్రయోజనం చేకూరనుంది. విద్యార్థులకే కాకుండా లెక్చరర్ల సామర్థ్యాభివృద్ధికి సైతం ఈ ఒప్పందం ప్రాధాన్యతనిస్తోంది. ఆన్‌లైన్.. బ్లెండెడ్ లెర్నింగ్(ఆఫ్‌లైన్+ఆన్‌లైన్) విధానాలపై కాలేజీ లెక్చరర్లకు ఐఐటీ మద్రాస్ సాంకేతిక సహకారంతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుండగా కౌన్సిల్ పర్యవేక్షించనున్నది.
రీసెర్చ్.. ఇంటర్న్‌షిప్‌లు
ఆన్‌లైన్ విద్యపై సంయుక్తంగా పరిశోధనలు, డేటా విశ్లేషణలు చేపట్టాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. విద్యార్థుల అభ్యాస ధోరణులు, కోర్సుల పూర్తి శాతం, ఫలితాలపై అధ్యయనం చేయనున్నారు. వీటితో పాటు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, మెంటర్‌షిప్ కార్యక్రమాల్లో ఐఐటీ మద్రాస్ మద్దతు అందించనుంది. అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు విద్యాశాఖ వెబ్‌సైట్లలో స్వయం ప్లస్ లింక్ ఉంచనున్నాయి. కొత్త కోర్సులపై విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాంలు, వర్క్‌షాప్‌లు నిర్వహించనుండగా, ఆన్‌లైన్ కోర్సుల క్రెడిట్లను రెగ్యులర్ డిగ్రీలకు అనుసంధానిస్తారు.
