ఓజీ.. ఒరిజినల్ గురు గంభీర్.. టీ20 వరల్డ్ కప్ విక్టరీ వెనుక మాస్టర్‌‌‌‌‌‌‌‌ మైండ్‌‌‌‌

ఓజీ.. ఒరిజినల్ గురు గంభీర్.. టీ20 వరల్డ్ కప్ విక్టరీ వెనుక మాస్టర్‌‌‌‌‌‌‌‌ మైండ్‌‌‌‌

వెలుగు, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌: టీమిండియా 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మరో ఐసీసీ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచేందుకు 11 ఏండ్లు పట్టింది. దాదాపు పుష్కరకాల పోరాటం తర్వాత 2024లో టీ20 కప్పు గెలిచి నిరీక్షణకు తెరదించింది. కానీ, ఇంకో రెండేండ్లు తిరిగే సరికి టీమిండియా ఖాతాలో మరో రెండు ఐసీసీ ట్రోఫీలు చేరాయి. గతేడాది మార్చి 9న దుబాయ్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీని ముద్దాడిన జట్టు.. ఏడాది పూర్తి కాకముందే అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌లో టీ20 కప్పును సొంతం చేసుకుంది.

మధ్యలో ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ (టీ20) విక్టరీ ఓ బోనస్‌‌‌‌‌‌‌‌. జట్టు సాధిస్తున్న ఈ విజయాల వెనుక ఓ మాస్టర్ మైండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. అదే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.  ముఖ్యంగా ఇండియా టీ20 సామ్రాజ్యాన్ని ఏలుతోంది అంటే అది డ్రెస్సింగ్ రూమ్ నుంచి గంభీర్ విసిరిన వ్యూహాల ఫలితమే. విమర్శలు ఎన్ని ఎదురైనా సరే తను నమ్మిన సిద్ధాంతాన్ని, ఆటగాళ్లను వదలకుండా ఇండియాను వరుసగా రెండోసారి వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్ విజేతగా నిలిపిన గంభీర్ తాను అసలైన ‘ఓజీ’ ( ఒరిజినల్ గురు) అని చాటిచెప్పాడు. గంభీర్ కేవలం కోచ్ మాత్రమే కాదు, ఆటగాడిలోని అసలైన సత్తాను పసిగట్టే వేటగాడు. 

శాంసన్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ టీమ్‌‌‌‌‌‌‌‌లో ఉండాలని కోచ్ కాకముందే గళమెత్తిన గంభీర్, సూర్యకుమార్ లోని నాయకత్వ లక్షణాలను అందరికంటే ముందే పసిగట్టాడు. వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో కీలక మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సంజూ శాంసన్ (97*)  వీరోచిత ఇన్నింగ్స్ ఆడి గెలిపించినా.. గంభీర్ దృష్టి మాత్రం జట్టు అవసరాలపైనే ఉంది. ఆ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో శివమ్ దూబే కొట్టిన రెండు ఫోర్లు కూడా శాంసన్ ఇన్నింగ్స్ అంత విలువైనవని గంభీర్ చెప్పాడు. వ్యక్తిగత స్కోర్ల కన్నా మ్యాచ్ గెలిపించే చిన్న చిన్న మెరుపులే ముఖ్యమని తను నమ్ముతాడు.

యువ రక్తంపై భరోసా

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్‌‌‌‌‌‌‌‌కు ఉందని గంభీర్ బలంగా నమ్మాడు. విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గకుండా అభిషేక్ శర్మను ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగించి, జట్టులో నిలదొక్కుకునేలా చేశాడు. గంభీర్ హయాంలో ఇండియా అత్యంత వేగంగా రన్స్ సాధించే జట్టుగా అవతరించింది. 150 ప్లస్ స్ట్రయిక్ రేట్‌‌‌‌‌‌‌‌తో బ్యాటర్లు విరుచుకుపడటం, తరచూ 250 పైచిలుకు స్కోర్లు సాధించడం గంభీర్ తెచ్చిన ‘అగ్రెసివ్ టెంప్లేట్’ ఫలితమే. 

గంభీర్ కోచింగ్‌‌‌‌‌‌‌‌లో ఆడిన 31 టీ20ల్లో ఇండియా 25 విజయాలు సాధించింది. సుమారు 80 శాతం విన్ రేటుతో, ఏడు టీ20 సిరీస్ విజయాలు సాధించి ఇండియాను గౌతీ తిరుగులేని శక్తిగా మార్చాడు. 2025 చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాల తర్వాత ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కూడా గెలవడంతో ఇండియా క్రికెట్‌‌‌‌‌‌‌‌లో గంభీర్ అజేయంగా నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో ఎదురైన వైఫల్యాల సమయంలో విమర్శలు.. కోహ్లీ, రోహిత్‌‌‌‌‌‌‌‌ జట్టు నుంచి తప్పుకోవడానికి కారణమని నిందలు వచ్చినా గౌతీ ఏనాడూ తలొగ్గలేదు. 

తాను నమ్మిన, తనను నమ్మిన ఆటగాళ్లపై పూర్తి భరోసా ఉంచి వారి నుంచి అత్యుత్తమ ఆటను రాబట్టడంలో గంభీర్ సక్సెస్‌‌‌‌ అయ్యాడు. ఆ పట్టుదలే ఇండియాను మళ్ళీ విశ్వవిజేతగా నిలిపింది. వ్యక్తిగత మైలురాళ్లను పక్కన పెట్టి, కేవలం జట్టు గెలుపే లక్ష్యంగా గౌతీ సాగించిన ప్రయాణం అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. ఆటగాడిగా 2007 టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ అందుకున్న గంభీర్ ఇప్పుడు గురువుగానూ టీ20 కప్పు నెగ్గి  అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 

నేనున్నంత వరకు వ్యక్తిగత రికార్డులకు చోటు లేదు: గౌతమ్ 

ఇండియన్ క్రికెట్‌‌‌‌లో వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయాలకే అగ్రతాంబూలం అని కోచ్ గంభీర్ కుండబద్దలు కొట్టాడు. ‘నేను, కెప్టెన్ సూర్యకుమార్ ఒకే ఆలోచనతో ఉన్నాం. వ్యక్తిగత మైలురాళ్లు ముఖ్యం కాదు, ట్రోఫీలే ముఖ్యం. ఇండియన్‌‌‌‌  క్రికెట్‌‌‌‌లో చాలా కాలంగా రికార్డుల గురించి చర్చ జరుగుతోంది. నేను కోచ్‌‌‌‌గా ఉన్నంత కాలం వ్యక్తిగత రికార్డుల వేడుకలకు చోటు ఉండదు. గత మూడు మ్యాచ్‌‌‌‌ల్లో సంజూ ఆడిన తీరు చూడండి (97*, 89, 88).  సంజూ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడి ఉంటే జట్టు స్కోరు 250 దాటేది కాదు. 

జట్టు కోసం సెంచరీని కూడా త్యాగం చేసే మనస్తత్వం కావాలి’ అని ఫైనల్ అనంతరం గంభీర్ మీడియాతో చెప్పాడు.  ఇక, సోషల్ మీడియాలో చర్చలు,  విమర్శలను తాను పట్టించుకోనని స్పష్టం చేశాడు. ‘నా బాధ్యత కేవలం డ్రెస్సింగ్ రూమ్‌‌‌‌లో ఉన్న ఆ 30 మంది పట్ల మాత్రమే. బయట ఎవరు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. ఒక ఆటగాడిని నమ్మి జట్టులోకి తీసుకున్నప్పుడు, నాలుగైదు మ్యాచ్‌‌‌‌ల్లో విఫలమైనంత మాత్రాన ఆ నమ్మకాన్ని వదులుకోకూడదు. ఈ టోర్నీ గెలిచినా ఓడినా, ఆ ఆటగాళ్లపై మాకున్న నమ్మకం అలాగే ఉంటుంది’ అని గంభీర్ చెప్పాడు.

కోచ్ సాబ్‌‌‌‌.. మీ నవ్వు బాగుంది: ధోనీ

టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాధించిన వేళ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండేండ్ల తర్వాత ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో పోస్ట్ చేశాడు.ఫైనల్‌‌‌‌కు అటెండ్ అయిన మహీ టీమ్‌‌‌‌కు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌‌‌‌కు అభినందనలు తెలిపాడు. ‘కోచ్ సాబ్.. మీ ముఖంలో ఆ చిరునవ్వు చాలా బాగుంది. సీరియస్‌‌‌‌నెస్‌‌‌‌తో కూడిన నవ్వు అనేది ఒక అదిరిపోయే కాంబినేషన్. చాలా అద్భుతంగా చేశారు. ఎంజాయ్ చేయండి. ఇక బుమ్రా గురించి నేను ఏమీ రాయకపోవడమే మంచిది. అతను ఒక చాంపియన్ బౌలర్’ అని పేర్కొన్నాడు.